వాక్ స్వాతంత్య్రం పేరుతో ఏవేవో మాట్లాడితే అది విజ్ఞప్తి అనిపించుకోదు. ఏకంగా ఓ కార్పొరేటర్ మోదీని విమర్శించడం ఎలాగో ఇదీ అంతే. సైద్దాంతిక పరంగా విమర్శించవచ్చు గానీ అలా మనం ఎవరిని విమర్శిస్తున్నాం? వారి స్థాయి ఏమిటి? మన స్థాయి ఏమిటి? అనేది కూడా వాక్ స్వాతంత్య్రంలో ఓ భాగం. ఏదో పబ్లిసిటీ కోసమో, సంచలనాల కోసమో ఏకంగా ట్రంప్‌నో, మోదీనో, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులనో విమర్శిస్తామంటే అది ఇతరుల హుందాతనాన్ని, వారు వ్యక్తిగత ఇమేజ్‌కి ఇబ్బందిగా మారుతుంది. అందుకే రాజ్యాంగంలో ప్రాధమిక హక్కులు, వాక్‌స్వాతంత్య్రంతో పాటు దానికి ఎన్నో పరిమితులు, షరతులు కూడా ఉంటాయి. ఆదేశిక సూత్రాల రూపంలో పొందు పరచబడ్డాయి.
తాజాగా కత్తి మహేష్.. పవన్‌కళ్యాణ్‌పై చేస్తున్న విమర్శల విషయంలో ఆయన కాస్త ఓవర్‌గా, తన తెలివిని చూపించి, పవన్‌పై విమర్శలు చేస్తే తాను కూడా ఓ సెలబ్రిటీని కాగలననే ఆశ మాత్రం స్పష్పంగా కనిపిస్తోంది. ఇక ఇండస్ట్రీలో కత్తిమహేష్‌కి ఉన్న ఏకైక సెలబ్రిటీ స్నేహితుడు బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు మాత్రమే. సంపూ నటించిన 'హృదయకాలేయం, కొబ్బరిమట్ట' చిత్రాలలో కత్తి మహేష్ నటించాడు. ఇక కత్తి మహేష్ తీసిన 'పెసరట్టు' చిత్రంలో సంపూ కనిపించాడు.
తాజాగా సంపూ, మహేష్‌కత్తి.. పవన్‌పై చేసిన విమర్శలపై స్పందించాడు. వాక్ స్వాతంత్య్రం ఎవరికైనా ఉంటుంది. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. ఏమి మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడాలి. ఇక విషయంపై ఎవరైనా తమ అభిప్రాయం చెప్పవచ్చు. కానీ అలా చెప్పడానికి ఓ పద్దతి ఉంటుంది. పవన్‌కళ్యాణ్ మంచి నటుడు కాకపోతే ఇన్ని కోట్ల హృదయాలను గెలవడం ఎలా సాధ్యం? పవన్ విషయంలో కత్తి అలా మాట్లాడి ఉండకూడదు. ఆయన ధోరణి నాకు చాలా బాధగా అనిపించింది.. అని సంపూ తెలిపాడు.
ఇక కత్తి మహేష్‌ని చూస్తే బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఖాన్ గుర్తుకొస్తున్నాడు. ఒకే ఒక్క చెత్త సినిమా తీసి, తర్వాత క్రిటిక్‌గా మారి, పవన్‌ని, రజనీకాంత్‌ని కార్టూన్ హీరోలుగా, మోహన్‌లాల్‌ని చోటా భీమ్‌గా చెబుతూ, 'బాహుబలి'పై విమర్శలు చేస్తే తనకు మరింత పబ్లిసిటీ వస్తుందని ఆయన చేసినట్లుగానే కత్తి మహేష్ ప్రవర్తిస్తున్నాడని చెప్పవచ్చు.