ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు సర్కార్‌పై ప్రజలకు తీవ్ర అసంతృప్తి ఉన్నా కూడా ప్రత్యామ్నాయంగా ఎవ్వరూ లేకపోవడమే ఆయనకు అదృష్టంగా మారింది. సరైన అవగాహన, సభలు, దీక్షలతో పాటు ప్రజల్లోకి వెళ్లడం, ప్రభుత్వ అసమర్ధతను, అవినీతిని ఎండకట్టడంలో వైసీపీ నేత జగన్ వెనుకబడుతున్నాడు. కేవలం ప్రచార కర్తగా ప్రశాంత్‌కిషోర్ ఉన్నా అన్ని ఆయనే చేయలేడు. మరోవైపు ప్రశాంత్ కిషోర్‌లో కూడా పలు లోపాలున్నాయి. ఆయన ఉత్తరాది, దక్షిణాది ఓటర్ల మనోగతాలు, ఆచరణ పద్దతి మద్య వైరుద్యాలను గుర్తించలేకపోతున్నాడు. ఆయన సలహాతోనే జగన్ నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబును కాల్చిచంపాలి.. నిక్కర్లు ఊడదీయాలి... ఉరివేయాలి అనే మాటలు మాట్లాడాడు. చివరకు ఆ ప్రశాంత్ కిషోర్ వ్యూహమే ఈ ఉప ఎన్నికల్లో జగన్‌కి బెడిసికొట్టింది. కానీ ఇది చంద్రబాబు గుర్తించలేకపోతున్నాడు. ఇదంతా తమ ప్రభుత్వ పనితీరు వల్ల వచ్చిన విజయమే అని భావిస్తున్నాడు.
త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపధ్యంలో కేవలం ఒకటిన్నర ఏడాది కోసం వైసీపీ అభ్యర్ధిని గెలిపించినా ఉపయోగం లేదనే నిర్లప్తతతోనే నంద్యాల ప్రజలు టిడిపికి ఓట్లేశారని, కేవలం జగన్ చేతకాని తనమే బాబు బలం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కాకినాడలో కూడా అధికార పక్షం అనే ప్లస్ టిడిపికి కలిసివచ్చిందనేది వాస్తవం. కానీ కిందటి ఎన్నికల్లో తాము 1.5 శాతం ఓట్లను టీడీపీ ఎక్కువగా సంపాదించుకుందని, కానీ నంద్యాల ఉప ఎన్నికల్లో తాము 16శాతం ఓట్లను అధికంగా తెచ్చుకున్నామని, కాకినాడలో కూడా ఘనవిజయం సాధించామని చంద్రబాబు ఉదాసీనంగా ఉంటే మాత్రం పరాభవం తప్పదు.
ఇక వైసీపీ తన సొంత బలం మీద కాకుండా ఇంకా వైఎస్ సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతల మీదనే నమ్మకం పెట్టుకోవడం ఆ పార్టీ దీనస్థితికి నిదర్శనం. తాజాగా నారా లోకేష్ రాబోయే ఎన్నికల్లో తాము 175 సీట్లను కైవసం చేసుకుంటామని చెబుతుంటే, తాజాగా చంద్రబాబు నాయుడు కూడా అదే పాట పాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ, ఒకటిన్నర ఏడాదిలో వచ్చే ఎన్నికల కోసం కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఇలా అందరూ ఇప్పటినుంచే కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్దికి అడ్డుతగులుతున్న విపక్షాలకు ప్రజలే బుద్ది చెప్పాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రతిఒక్కరు ప్రజలకు చేరువ చేయాలని, ఏ సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని ఆయన చెప్పారు.
ఇలా ముందడుగు వేయాలని, ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 175 స్థానాలకు గాను 175ని తామే గెలుచుకుంటామని చెబుతున్న ఆయన ఏదైనా భ్రమల్లో ఉన్నారా? అనే అనుమానమైతే రాకమానదు. చంద్రబాబు కూడా క్షేత్రస్థాయిలోని ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, ఆగ్రహాలను, మితిమీరిన అవినీతి వంటి వాటిని ఇప్పటిలా పట్టించుకోకపోతే మాత్రం అది జగన్‌కి ఖచ్చితంగా మేలు చేస్తుందనే చెప్పాలి.