మోహన్‌బాబు.. ఈయన పేరు తెలుగు సినీ ప్రేమికులకు ఎంతో సుపరిచితమైన పేరు. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్ వేషాలు, ఆ తర్వాత విలన్ పాత్రలు, ఆ తర్వాత హీరోగా మారి, నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలు తీసిన వ్యక్తి ఆయన. ఆయన దాదాపు 50 చిత్రాలను నిర్మించడమే కాదు.. విలన్‌గా వచ్చి హీరోగా అందరినీ అలరించాడు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ నాడు ఓ ట్రెండ్ సెట్టర్. ఇక ఆయన కెరీర్‌లో ఎంతో కీలకమైన పాత్రను పోషించిన వారు ఇద్దరు. ఒకరు దాసరి నారాయణరావు, మరోకరు ఎన్టీఆర్.
దాసరి నటునిగా ఆయనకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తే ఎన్టీఆర్ ఆయనకు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఇక ఆయన తరుచుగా ఎన్టీఆర్ తర్వాత క్రమశిక్షణ కలిగిన నటుడిని నేనే అని తనకు తాను పొగుడుకుంటూ ఉంటాడు. వాస్తవానికి ఎవరిలోనైనా మంచి గుణం ఉంటే దానిని బయటి వారు చెప్పాలి. పొగడాలి.. కానీ మనకు మనం మన గొప్పతనం చెప్పుకుంటే అది నవ్వులాటగా ఉంటుంది. ఇక తరచుగా దాసరి గురించి చెప్పే ఆయన ఆ తర్వాత ఎక్కువగా ఎన్టీఆర్ పేరును వల్లెవేస్తుంటాడు. కానీ ఆయన అక్కినేని నాగేశ్వరరావుని మాత్రం పొగిడిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. దాసరి, ఎన్టీఆర్‌ల గురించి చెప్పినట్లుగా ఆయన ఏయన్నార్ గురించి గొప్పగా చెప్పలేదు.
అంతేకాదు.. నాటి 'ప్రేమాభిషేకం' చిత్రంలో ఏయన్నార్ తన నటన చూసి ఎంతో ఈర్ష్యపడ్డారని, ఏయన్నార్ కంటే తానే డైలాగ్‌లు బాగా చెబుతానని అక్కినేని సతీమణి అన్నపూర్ణ తనను పొగిడిందని ఓ బహిరంగ వేదికపై చెప్పాడు. దాంతో వేదికపై ఉన్న అక్కినేని కూడా నొచ్చుకున్నారు. దానికి వేదికపై ఉన్న చిరంజీవి సమాధానం ఇస్తూ.. అది తల్లి దీవెన వంటిదని, తండ్రి కంటే కుమారుడు గొప్పవాడు కాలేడు. కుమారుడికి ప్రోత్సాహం కోసం తల్లి అలా చెబుతుంది. అంతమాత్రాన తండ్రి వంటి వారిని తల్లి చెప్పిన మాటలతో కించపరచకూడదు అంటూ సమాధానం ఇచ్చాడు.
ఏదిఏమైనా తాజాగా నాటి ఎవర్‌గ్రీన్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో మోహన్‌బాబు కలిసి తీయించుకున్న ఫొటోని మోహన్‌బాబు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది 30ఏళ్ల కిందటి ఫొటో. దీనిలో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు మోహన్‌బాబు భుజంపై చేయి వేసి ఉన్నారు. నటునిగా అప్పుడే ఓనమాలు దిద్దుతున్న నాకు ఇద్దరు మహానటులతో కలిసి నటించే అవకాశం రావడం ఓ సవాల్. అది నాకు దక్కిన అరుదైన గౌరవం.. అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ ఫొటో ఎన్టీఆర్, ఏయన్నార్, మంచు ఫ్యామిలీ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది.