ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' స్టార్ట్ అయినప్పుటి నుండి షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా శరవేగంగా పరిగెత్తిస్తూనే ఉన్నాడు. అందుకే అనుకున్న టైం కి సినిమాని విడుదల చెయ్యగలుగుతున్నాడు. అయితే ఎన్టీఆర్ 'జై లవ కుశ'తో పాటే బుల్లితెర మీద బిగ్ బాస్ షోకి హోస్ట్ గా కూడా ఒప్పుకుని..... ఒక వైపు 'జై లవ కుశ' షూటింగ్ తోపాటు మరోవైపు బిగ్ బాస్ షూటింగ్ కి హాజరవుతూ నానా హైరానా పడ్డాడు. ఇక ఇప్పుడు 'జై లవ కుశ' షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే బుల్లితెర మీద ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో సీజన్ 1 కూడా మరో పది రోజులో పూర్తి కావొస్తుంది.
ఇక ఎన్టీఆర్ బిగ్ బాస్ షో పూణే లో జరగడంతో... అక్కడ వాళ్ళు పిలిచినప్పుడు వెంటనే రావాలనే ఎక్కే ఫ్లైట్ ఎక్కడం దిగే ఫ్లైట్ దిగడం అన్నట్టు ఎన్టీఆర్ లైఫ్ మారిపోయింది. అలాగే 'జై లవ కుశ' షూటింగ్ కూడా పూణేలో ప్లాన్ చేసినప్పటికీ అన్నిరోజులు అక్కడ చెయ్యలేరు కాబట్టి 'జై లవ కుశ' షూటింగ్ కోసం కూడా అలానే పరుగులు పెట్టడం... ఇల్లు, ఇల్లాలు, కొడుకు పట్టకుండా తిరగడం మాత్రం గత రెండు నెలల నుండి జరుగుతున్న ఎన్టీఆర్ జీవిత ప్రక్రియ. మరి బిగ్ బాస్ షో కోసం భారీ పారితోషకం అందుకున్నప్పటికీ కష్టాలు పడడం మాటలు కాదు కదా.
అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ని ఇక్కడ హైదరాబాద్ లోనే సెట్ చేస్తున్నారట. సీజన్ 2 కి కూడా ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి హోస్ట్ గా ఫిక్స్ అవడంతోనే బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ని హైదరాబాద్ లోనే వెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట. దానికోసం ఒక భారీ విల్లాని అద్దెకు తీసుకోవాలని భావిస్తోందట బిగ్ బాస్ యాజమాన్యం. దీనికోసం ఇప్పటికే ఇంటి వేట షురూ చేశారట ఛానెల్ ప్రతినిధులు. ఒకవేళ అనుకున్న ప్రమాణాలతో విల్లా దొరక్కపోతే.. అప్పుడు బిగ్ బాస్ సెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారన్నమాట.
సో దీన్నిబట్టి ఈసారి ఎన్టీఆర్ బిగ్ బాస్ కోసం హడావిడి పడక్కర్లేదన్నమాట. అలాగే త్రివిక్రంతో సినిమా స్టార్ట్ అయినా ఎన్టీఆర్ ఆరమ్స్ గా తన షూటింగ్ ని చేసుకోవచ్చన్నమాట. ఈలెక్కన ఎన్టీఆర్ కి మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు చాలానే హెల్ప్ చేసినట్టేగా.!