ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డు అంటే అది పెద్ద విషయమే. కానీ ఈ ఏడాది వచ్చిన విజువల్ వండర్ 'బాహుబలి-దికన్‌క్లూజన్'ని చూసిన వారు, ఈ చిత్రం కోసం ఏకంగా ఐదేళ్లు అంకితమై, ఆయన నటించిన ప్రతిభ, ఆయన బాడీ పరంగా, లుక్‌పరంగా చూపించిన వైవిధ్యం.. ఈ చిత్రం సాధించిన విజయం, ప్రతి ఫ్రేమ్‌లోనూ కళ్లకు కట్టే ప్రభాస్ ప్రతిభను చూసిన వారు మాత్రం ఈసారి రాజకీయాలకు చోటు లేకపోతే ప్రభాస్‌కి, బాహుబలికి జాతీయ అవార్డుతో పాటు, ఈ చిత్రం పలు అవార్డులను సొంతం చేసుకోవడం ఖాయమనే అంటున్నారు.
మరోవైపు తాజాగా 'జై లవకుశ' చిత్రం నిర్మాత, ఈ చిత్రం హీరో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ, 'జై వలకుశ'లోని 'జై' పాత్ర, అందులో ఆయన చూపించిన నటన, నత్తితో ఆయన చెప్పిన డైలాగ్ డెలివరి వంటివి ఎన్టీఆర్‌కి జాతీయ అవార్డును తెచ్చిపెడతాయని నమ్మకంగా చెబుతున్నాడు. ఎందుకంటే తాను ఇప్పటికే సినిమా చూశానని, అదిరిపోయిందని, ఎన్టీఆర్‌కి జాతీయ అవార్డు ఖాయమంటున్నాడు. ఎవరి సినిమా వారికి హిట్టే. ఇక్కడ 'బాహుబలి'లో ప్రభాస్‌కి ఉత్తమనటుడు జాతీయ అవార్డు లభిస్తుందని ఎందుకు అనాల్సివస్తుంది అంటే ఆ చిత్రం ఆల్‌రెడీ రిలీజ్ అయింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే 'జై లవకుశ' విడుదలైన తర్వాత ఇలాంటి మాటలు చెబితే బాగుంటుంది కానీ విడుదలకు ముందే ఏదో అంచనాలను పెంచేందుకు ఇలాంటి అతిశయోక్తులు చెబితే ఎవ్వరూ నమ్మరు.
గతంలో దాసరి నారాయణరావు కూడా 'పరమవీరచక్ర' చిత్రానికి జాతీయ అవార్డు, బాలకృష్ణ నటనకు జాతీయ అవార్డులు ఖాయమని, ఆ అవార్డులు ఈ చిత్రానికి రాకపోతే అసలు వాటిని అవార్డులుగా తాను భావించనని భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మరి ఫలితం ఏమైందో...? కనీసం శాటిలైట్ రైట్స్ కూడా ఇప్పటికీ అమ్ముడు కాలేదంటే పరిస్థితి అర్ధమవుతుంది. ఇక 'జై లవ కుశ' చిత్రం విషయానికి వస్తే ఎన్టీఆర్ నుంచి రాజమౌళి, రాఘవేంద్రరావు, సాయిధరమ్‌తేజ్ వరకు అందరూ 'జై' క్యారక్టర్ గురించే మాట్లాడుతున్నారు. ఇక ట్రైలర్‌లో కూడా కేవలం 'జై' పాత్ర మాత్రమే హైలైట్ అయింది కానీ 'లవ, కుశ' క్యారెక్టర్లు కేవలం సాదాసీదాగా ఉన్నాయి.
ఇక ఇందులోని లవ, కుశ సీన్లు కొన్ని చూస్తే అలనాటి చిరంజీవి 'రౌడీ అల్లుడు' సీన్స్ గుర్తుకొస్తున్నాయి. 'జై' క్యారెక్టర్ గురించే అందరూ మాట్లాడుతుండటం, లవ, కుశ పాత్రల్లో ఏమాత్రం వైవిధ్యం లేకుండా సాదాసీదాగా ఉండటం, ఇక జై పాత్ర కూడా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే పాత్రగా కనిపిస్తుందే గానీ ఏదో 'అపరిచితుడు, శివపుత్రుడు'లోని విక్రమ్ క్యారెక్టర్లలాగా విమర్శకుల ప్రశంసలను పొందేలా, అవార్డు గెలిచే సత్తాగా కనిపించడం లేదని చెప్పాలి.