ఒకప్పుడు ఆడియో హిట్ అయితే సగం సినిమా హిట్టయినట్లు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తూ ఉండేవి. కానీ నేడు ప్రేక్షకుల ఆలోచనా సరళిలో ఎంతో తేడా వచ్చింది. కేవలం పాటలు, డ్యాన్స్‌లను చూసి సినిమాలు చూసే రోజులు పోయాయి. అలాగని పాటలు అసలు బాగాలేకపోయినా ప్రేక్షకులు ఆదరిస్తారా? అంటే కాదనే చెప్పాలి. కానీ ముందుగా ప్రేక్షకులకు కావాల్సింది సినిమా కంటెంట్‌లో దమ్ము... వైవిధ్యం. అవి బాగా ఉంటే మిగిలిన పాటలు, యాక్షన్ సీన్స్ అన్ని కూరల్లో కేవలం అదనపు సువాసనల కోసం వేసే పదార్ధాలు మాత్రమే.
మరీ ముఖ్యంగా నేటి ప్రేక్షకులు.. కేవలం ఎక్కడ పడితే అక్కడ పాటలను ఉంచి, కథాగమనాన్ని దెబ్బతీసే పాటలను మాత్రం అసలు కోరుకోవడం లేదు. దాంతో నేటి స్టార్స్ కూడా ఒకప్పుడు తమ చిత్రాలలో కనీసం ఆరు పాటలు ఉండాలని పట్టుబట్టే వారు కూడా కథానుగుణంగా ఎన్నిపాటలకు ఆ సినిమాలో స్కోప్ ఉంటే అన్నే పాటలను ఆశిస్తున్నారు కానీ లేనిపోని సందర్భాలను సృష్టించి పాటలను ఇరికించే ప్రయత్నాలు చేస్తే మాత్రం తిప్పిగొడుతున్నారు. ఈ విషయం 'జై లవ కుశ' విషయంలో మనకి స్పష్టంగా కనిపిస్తోంది.
ఎన్టీఆర్ వంటి డ్యాన్స్‌లు ఇరగదీసే హీరో, అద్భుతమైన ట్యూన్స్‌ని, అందరినీ అలరించే సంగీత మాంత్రికుడు దేవిశ్రీప్రసాద్ ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని కేవలం నాలుగు పాటలకే పరిమితం చేశారు. కానీ ఇప్పుడు అదే పనిగా ఎన్టీఆర్ చిత్రానికి నాలుగు పాటలే ఉంటే అభిమానులకు కాస్త నిరాశ కలుగుతుందనే భయంతో ఇప్పుడు ఐదో పాటను చిత్రీకరించారు. తమన్నా, ఎన్టీఆర్‌లపై వచ్చే ఈ పాటను ఐటం సాంగ్‌గానే భావించాల్సి వస్తుంది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేని అందించిన కోనవెంకట్ ఈ పాట గురించి మాట్లాడుతూ, ఇప్పటివరకు బయటకు వచ్చిన నాలుగు పాటల కంటే ఈ ఐదో పాట అద్భుతంగా ఉంటుందని, ఎన్టీఆర్-తమన్నాలపై వచ్చే ఈ పాట యూత్‌ని ఊపేస్తుందని అంటున్నాడు. అంతేకాదు.. ఈ పాట ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్ సాంగ్‌గా నిలుస్తుందని చెబుతూ, ప్రేక్షకులను ఊరించే ప్రయత్నం చేస్తున్నాడు.