కాంగ్రెస్ కిందటి ఎన్నికల ముందు తెలంగాణ ఇచ్చినప్పటికీ అటు ఆ క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకోవడంలో విఫలమై తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. మరోపక్క అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించిన తీరుకి ఏపీలో నామరూపాల్లేకుండా పోయింది. ఇప్పటికైనా ఆ పార్టీకి కాస్తైనా తెలంగాణలో పట్టుందేమో గానీ తాజాగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్దులు కేవలం వందలలో మాత్రమే ఓట్లు సాధించడం చూస్తే ఏపీ ప్రజలు ఇప్పట్లో కాంగ్రెస్‌ని క్షమించే పరిస్థితే లేదని తేటతెల్లమవుతోంది.
మరోపక్క తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌పై ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులే పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. ఉత్తమ్‌పై కాంగ్రెస్‌లో బలమైన నాయకులైన కోమటి రెడ్డి వర్గం గుర్రుగా ఉంది. త్వరలో అంటే వచ్చే ఎన్నికలలోపే కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ని సాగనంపి కోమటిరెడ్డికి ఆ పదవిని అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం, అందునా రాజకుమారుడు రాహుల్‌గాంధీ భావిస్తున్నాడు. అందులో భాగంగానే కోమటిరెడ్డి తెలంగాణ ప్రాంతంలో ఓ టీవీ చానెల్‌ను, పత్రికను స్థాపించి, తమకు అనుకూలంగా మీడియా ఉండేలా పైఎత్తులు వేస్తున్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌ని పిసిసి పదవి నుంచి తప్పించాల్సిందేనని మరోసారి కోమటిరెడ్డి స్పష్టం చేశాడు. ఉత్తమ్‌కుమారే పీసీసి అధ్యక్షునిగా కొనసాగుతారని తాను చెప్పలేదని ఢిల్లీ అధిష్టానంకు చెందిన కుంతియా తనకు చెప్పారని, కానీ ఉత్తమ్ మాత్రం కుంతియా తానే పీసీసీ చీఫ్‌గా ఉంటానని ఆమె చెప్పినట్లు ప్రచారం చేసుకుంటున్నాడని కోమటిరెడ్డి అంటున్నాడు. పీసీసీ చీప్‌గా మాకు ఏడాది అవకాశం ఇవ్వాలి. కనీసం మాకు ఇవ్వకపోయినా తెలంగాణ కోసం పోరాడిన వారికైనా పీసీసీ పదవి ఇవ్వాలని, అంతేకాగా ఉత్తమ్‌ని మాత్రం పదవిలో ఉంచరాదని కోమటిరెడ్డి చెబుతున్నాడు. ఎవరికిస్తే బాగుంటుందో కాంగ్రెస్ అధిష్టానమే సర్వే చేయించాలి. ఉత్తమ్ కొనసాగితే వచ్చే ఎన్నికలలో పోటీ చేయను. ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ చేసుకుంటాను. సమయం వచ్చినప్పుడు మరలా రంగంలోకి దూకుతాను. తాము పార్టీని వీడుతామని ఉత్తమ్ ప్రచారం చేయిస్తున్నాడు.
కానీ పార్టీని వీడం. పార్టీలో ఉంటూనే ఉత్తమ్‌పై కొట్లాడుతాం. ఈ మాటలను నేను చెప్పడంలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు, కిందిస్థాయి నాయకుల మాటలనే నేను చెబుతున్నాను. ఫంక్షన్ హాల్ మీటింగ్‌ల ద్వారా అధికారం రాదు. పాదయాత్రతో జనాలలోకి వెళ్లాలి. ఉత్తమ్ నాయకత్వంలో ఇప్పటివరకు ఎలాంటి ఫలితాలు రాలేదు. గుత్తా రాజీనామా చేస్తాడన్న నమ్మకం లేదని కోమటి రెడ్డి అన్నాడు. తెలంగాణలో టిడిపి కనుమరుగు కావడం, ఎంత ఆపసోపాలు పడినా బిజెపి బలం పుంజుకోలేకపోతుండటం, కాంగ్రెస్‌లోని కీచులాటలు చూస్తే వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కి ఎవ్వరూ పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పాలి.