రెండు తెలుగు రాష్ట్రాలలోని పొలిటీషియన్స్‌లో నిన్నటి కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ది విభిన్నమైన శైలి. ఎంతో తెలివైన వాడిగా, రాజకీయాలు బాగా ఔపోసన పట్టిన వానిగా ఆయనకు పేరుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికున్న రోజుల్లో ఆయనకు భుజం వంటి నాయకులలో ఉండవల్లి ఒకరు. వైఎస్ చెప్పిందే తడవుగా చట్టాలను, ఇతర విషయాలను బయటకి తీసి.. ఎవ్వరూ కనీసం విమర్శించడానికి కూడా కలలో కూడా సాహసించని ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుపై ఉండవల్లి అప్రకటిత యుద్దం కొనసాగించాడు. నాడు తన మాటలతో, ఆర్బీఐ చట్టాలు, సూచనలతో రామోజీరావుకి సంబంధించిన మార్గదర్శి చిట్స్‌పై ఒంటికాలిపై లేచాడు.
ఇక వైఎస్ మరణం, ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపద్యంలో ఆయన మౌనంగా ఉంటున్నారు. ఇక మొదట్లో ఆయన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్ జగన్‌కి, ఆయన స్థాపించిన వైసీపీకి కాస్త ఆకర్షితుడైనట్లే కనిపించాడు గానీ వైసీపీలో జగన్ చిన్నాపెద్దా తారతమ్యాలు చూడడని, ఎవరిని, ఎవరి తెలివిని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో తెలియని జగన్ అందరినీ లెక్కచేయని విధంగా ప్రవర్తిస్తాడని గ్రహించి, తన సన్నిహితులైన సబ్బం హరి, లగడపాటిలతో పాటు ప్రసుతం మౌనంగా ఉంటున్నాడు.
తాజాగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలలో సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు వయసును చూసైనా జగన్ ఆయనకు గౌరవం ఇవ్వాలని ఉండవల్లి జగన్‌కి సూచించాడు. మొదట జగన్ ఇతరులను గౌరవించడం నేర్చుకుంటే ప్రజల మదిలో స్థానం దక్కించుకుంటాడని తెలిపాడు. చంద్రబాబు చేసేది తప్పయినా సరే చాలా తక్కువ వయసున్న జగన్ సంయమనం పాటించాలని ఆయన కోరారు. మరోవైపు ఆయన చంద్రబాబుని కూడా బాగా టార్గెట్ చేశాడు. చంద్రబాబులాగా అబద్దాలు చెబుతోన్న సీఎంను తాను ఇప్పటివరకు చూడలేదని చెప్పాడు.
డిసెంబర్ నాటికి కూడా పూర్తయ్యే అవకాశాలు లేని పురుషోత్త పట్టణం ప్రాజెక్ట్‌ను ఇంకా పనులు పూర్తవ్వకుండానే ఆగష్టు15న జాతికి అంకితం చేయడం ఏమిటని? ఆయన ప్రశ్నించారు. పోలవరం పనులు ఏడాదికి మూడు శాతం మాత్రమే పూర్తవుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే మరో ఐదేళ్లయినా సాధ్యం కాదని తెగేసిచెప్పారు. ప్రాజెక్ట్‌ల పేరిట చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆయన తీవ్రంగా దుయ్యబడుతూనే జగన్ వయసుకు గౌరవం ఇవ్వాలని, సంయమనం కోల్పోకుండా ఆచితూచి మాట్లాడాలని సూచించి తన మనోగతం చాటుకున్నాడు.