అవార్డులు ఇచ్చేటప్పుడూ... సదరు అవార్డు కమిటీవారు... ఏ ఏ అంశాలను పరిగణన లోకి తీసుకొని ఈ అవార్డులను ఇస్తారో కాస్త చెబితే తెలుసుకోవాలనుంది.
ప్రతిభను బట్టి అవార్డు ఇస్తారా? లేక.. ‘పేరు’ సిపార్సు చేసిన వారిని బట్టి అవార్డు ఇస్తారా? లేక పరిచయాలను బట్టి ఇస్తారా? ఇంకా ఏమైనా ఉన్నాయా? వీటి విషయంలో కాస్త క్లారిటీ కావాలి.
ఎందుకంటే కంటి ముందు అద్వితీయమైన ప్రతిభామూర్తులు కనిపిస్తున్నారు. కానీ.. వారికి అవార్డులు రావడంలా. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్లు అవార్డులు పట్టుకుపోతున్నారు. అందుకే.. అసలు ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? కాస్త తెలియజేస్తే.. సదరు అవార్డును గౌరవించాలా? లైట్ గా తీసుకోవాలా? అనే విషయాలను జనాలు చూసుకుంటారు.
అవార్డు నా ఇంట్లోదయితే.. నేను ఎవరికైనా ఇచ్చుకుంటా. ఎవరికీ సంజాయిషీ చెప్పుకోవాల్సిన పనిలేదు. కానీ.. ప్రభుత్వాలు అవార్డులు ఇస్తున్నాయంటే... అది ప్రజలే ఇస్తున్నట్లు. మరి ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి కదా. ప్రజాస్వామ్యం పుణ్యమా అని... ఐదేళ్లకోసారి మాత్రం అభిప్రాయం చెబుతుంటారు ప్రజలు. ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయం అంటే.. ఊకలో ఈక.
ఇప్పటి వరకూ కైకాల సత్యనారాయణకు పద్మశ్రీ లేదు. కానీ.. కోట శ్రీనివాసరావు ఇప్పుడు పద్మశ్రీ.
ఇప్పటి వరకూ కె.రాఘవేంద్రరావుకు పద్మశ్రీ లేదు. కానీ... పది సినిమాలు తీసిన రాజమౌళి ఇప్పుడు పద్మశ్రీ..
హాస్య చక్రవర్తి రాజబాబు పద్మశ్రీ కాదు. కానీ... బ్రహ్మానందం ఇప్పుడు పద్మశ్రీ..
150 సినిమాలు తీసిన దర్శకుడు దాసరి నారాయణరావు... పద్మశ్రీ కాదు.
తెలుగుతెరకు సొగబులద్దిన సోగ్గాడు శోభన్ బాబు... పద్మశ్రీ కాదు.
వైవిధ్యాభినయానికి మారుపేరైన చంద్రమోహన్... పద్మశ్రీ కాదు.
కాంతారావు, గుమ్మడి లాంటి మహానటులు కూడా పద్మశ్రీలు కారు.
వీటన్నింటికంటే... అతిపెద్ద కామెడీ ఏంటో చెప్పనా? తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలకు చాటిచెప్పిన మహా దర్శకుడు కె.వి.రెడ్డికి పద్మశ్రీ లేదు.
విశ్వ నట చక్రవర్తి ఎస్వీరంగారావుగారికి పద్మశ్రీ లేదు.
వెండితెర వెన్నెల వెలుగు.. మహానటి సావిత్రికి పద్మశ్రీ లేదు.
తెలుగింటి సీతమ్మ అంజలీదేవికి పద్మశ్రీ లేదు.
గోవిందరాజుల సుబ్బారావు, సిఎస్ఆర్ ఆంజనేయులు సంగతి సరేసరి.
ఇక.. శ్రీ శ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, దాశరధి, వేటూరి, సిరివెన్నెల లాంటి మహాకవుల విషయం దేవుడెరుగు?
ఈ పరిణామం చూసి కలతచెందాల్సిన పనిలేదు. అన్నిటికీ సిద్దంగా ఉండాలి. గుండెను దిటవు చేసుకోవాలి. ముందు ముందు ఇంకా అద్భుతాలు చూస్తాం.
రేపు.. ధన్ రాజ్ పద్మశ్రీ కావొచ్చు. తాగుబోతు రమేశ్ పద్మభూణుడవ్వొచ్చు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీసిన వంగా సందీప్ రెడ్డి పద్మవిభూషనుడై తెలుగుజాతిని పులకింపజేయొచ్చు. ఏమో.. గుర్రం ఎగురా వొచ్చు.
కొసమెరుపు:-
ఎస్.ఎస్.రాజమౌళికి... అక్కినేని జాతీయ పురస్కారం ఇవ్వడం తప్పే కాదు. ఆ మాటకొస్తే ఎవరికైనా ఇవ్వొచ్చు. అది వాళ్ల ఇంటి అవార్డు వాళ్ల ఇష్టం. కానీ.. ప్రోటోకాల్ ఒకటుంటుంది కదా. రాజమౌళి తీసుకున్న తర్వాత... అదే అవార్డుని అతని గురువైన కె.రాఘవేంద్రరావు తీసుకోగలరా?. అంతేకాదు... భారతీరాజా, ప్రియదర్శిన్, ఫాజిల్, మణిరత్నం.... ఇత్యాది గొప్ప దర్శకులు... ‘అక్కినేని అవార్డు’ ఫ్యూచర్లో అందుకోవాల్సొచ్చినా... ‘రాజమౌళి తర్వాత తీసుకుంటున్నాం’ అన్న ఫీలింగ్ వారి మనసుల్లో ఉండకుండా పోతుందా?
ఇదంతా కేవలం నా అభిప్రాయమే.. తప్పయితే క్షమించాలి.
-బుర్ర నరసింహ
ఫిలిం జర్నలిస్ట్