మగవారు మద్యం మత్తులో ఉంటే ఆడవారికి ఎన్నో కష్టాలు తప్పవు. సంపాదించినదంతా మందుకు ధారబోసి ఇంట్లో భార్యలకు కట్టుకునేందుకు చీరలు, వండేందుకు బియ్యం, పప్పు, కూరలు ఉన్నాయోలేదో కూడా తెలియని స్థితిలో ఉంటే ఇక ఆ గృహిణి సాధకబాధకాలు ఆ దేవుడికే తెలియాలి. ఇక ఆడవారి వీక్‌నెస్ ఏమిటంటే.. ఇంట్లో ఏమి ఉన్నా లేకున్నా తమకున్న చీరల మోజులో గుడ్డలు మాత్రం మంచివి ఉండాలని భావిస్తారు.
దానికోసం కేరళలోని కొచ్చిలో మందుకు ఓ వినూత్న ఆఫర్ ఇస్తూ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నారు. లోకల్ టీవీలలో వస్తున్నప్రకటన అక్కడి ప్రజలందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. షీవాజీ రీగల్, విస్కీ బాటిల్ ఖరీదు 100 డాలర్ల వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో దాని విలువ దాదాపు 6,600 రూపాయలు. ఈ బాటిల్‌ని కొంటే ఓ ఖరీదైన చీర ఉచితంగా ఇస్తామని ఆ షాప్ వారు ఓ వినూత్న ఆఫర్ పెట్టారు. దీంతో ఈ వార్త కేరళ అంతా వైరల్ అవుతోంది. మందు బలహీనతతో మగవారి సెంటిమెంట్ మీద, ఖరీదైన ఉచిత చీర ద్వారా మహిళల సెంటిమెంట్ మీద ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టిన ఘనత ఈ షాప్ వారికేదక్కుతుంది.
అందునా ఈ మందుని కొన్నవారికి ఏదో ఫ్యాషన్ చీర కాకుండా కేరళ సంప్రదాయ చీరను అందిస్తుండటం విశేషం. కేరళవారి సంప్రదాయ, ముఖ్యమైన పండుగ అయిన ఓనమ్ సీజన్‌లోనే ఈ షాప్ వారు ప్రజల వీక్‌నెస్ పై దెబ్బకొట్టారు. లిక్కర్ ఫారిన్‌ది అయితే చీర మాత్రం కేరళ సంప్రదాయ చీర అంటూ మందుబాబులు ఉత్సాహంగా భార్యా మణులు చీరల కోసం ఆ షాప్ ముందు క్యూ కడుతున్నారు. అదీ సంగతి...!