ఏది పట్టినా విపరీతపు పిచ్చి పడితే ఇక మన ప్రేక్షకులను కూడా అరవ అతితో పోల్చడానికి ఏమాత్రం సంశయం లేదు. సినిమాని సినిమాలాగా చూడాలి... హీరోని హీరోలాగా చూసి అభిమానించడంలో తప్పులేదు. కానీ 'అర్జున్‌రెడ్డి' ఆ సినిమాలో ఆ పని చేశాడు కాబట్టి మనం కూడా అదేచేద్దాం.. ఆయనను ఫాలో అవుదాం అనుకుంటేనే చిక్కు వస్తుంది. మెగాస్టార్‌గా చిరంజీవి అవతరించడానికి ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల కఠోరశ్రమ ఆయన్ను ఆ స్థాయికి చేర్చింది. కానీ ఒక్క సినిమాతో వచ్చి సంచలనం సృష్టించి, ఎందరి మనసులనో దోచుకున్న వారు తర్వాతి కాలంలో సరైనహిట్ లేక, మొదటి చిత్రాల మ్యాజిక్ రిపీట్ చేయలేక బోల్తాపడినవారు ఎందరో ఉన్నారు. అందుకే ఓవర్‌నైట్ వచ్చిన స్టార్‌డమ్‌ని నిలుపుకోవాలంటే ఎంతో ప్రయత్నంచేయాలి. ఇక మన యువతను చెడగొట్టేది ఎవరోకాదు.. మన సినిమా వారేనని ఖచ్చితంగా చెప్పవచ్చు.
అసలు విజయ్‌దేవరకొండను ఎవ్వరూ కేవలం ప్రత్యేక తెలంగాణ వాడిగా చూడటం లేదు. రెండురాష్ట్రాలలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారంతా అభిమానిస్తున్నారు. కానీ మంట పుట్టించి, ఆ వేడిలో చలిగాచుకునే వర్మ వంటి వారే విజయ్ దేవరకొండను తెలంగాణ మెగాస్టార్ అని, నితిన్ స్థానంలో ఇక విజయే మెగాస్టార్ అని, పవర్‌స్టార్ కేవలం ఫేక్‌స్టార్ అని, ఆయన తన బిరుదుని విజయ్ దేవరకొండకి ఇచ్చేయమని నానా విధాలైన వ్యాఖ్యలు చేసి యువతను రెచ్చగొడుతున్నారు. మరి విజయ్‌ని ఏపీ వారు ఆదరించకపోతే అంతటి కలెక్షన్లు ఉండేవా? ఆయన్నుకేవలం తెలంగాణ వాడిగా ఎందుకుచూస్తున్నారు? అనేది అసలు ప్రశ్న. ఇక ఈ మద్య 'ఫిదా' వచ్చినప్పుడు అందరినోటా భాన్సువాడ భానుమతి, సాయిపల్లవి నామస్మరణే జరిగింది. తెలంగాణ నేపద్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏపీ ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టిన సంగతి మర్చిపోకూడదు.
ఇక ఇప్పుడు తెలంగాణ యువతకు విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్, అయిపోయాడు. అది ప్రస్తుతానికి ఎంతో ఆనందాన్నిస్తుంది. కానీ ఆయన రాబోయే చిత్రాలకు ఆ పేరు, ప్రతిష్టలే పెద్ద నష్టం చేకూర్చే విధంగా పరిస్థితి మారిపోయినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇక తాజాగా విజయ్‌దేవరకొండ 'అర్జున్‌రెడ్డి'లో గెడ్డం పెంచుకుని ఉన్న ఫోటోని కొందరు ఆయన అభిమానులు రోడ్డుపై గీశారు. గీసిన వారి ప్రతిభ బాగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో బాగా షేర్ అవుతోంది. మరి ఈ పిచ్చి ఇక్కడితో అయినా ఆగుతుందేమో చూద్దాం. అయితే విజయ్‌దేవరకొండ విషయంలో ఒక మంచి జరిగింది. ఇంతకాలం వారసత్వం బురదలో దొర్లుతున్న వారికి నాని, శర్వానంద్, రాజ్‌తరుణ్, విజయ్‌దేవరకొండ వంటి వారు ఓ ఆశాదీపంగా కనిపిస్తున్నారు. భావదారిద్య్రపు శృంఖలాలను వీరైనా తెంచేస్తే అంతకంటే తెలుగు సినిమాకి కావాల్సింది ఏముంది...!