తెలుగు ప్రేక్షకుల్లో నందమూరి నటసింహం బాలకృష్ణకి, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో పైసా వసూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీన విడుదలైంది. దీనికి నెగటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రం థియేటికల్ రైట్స్ దాదాపు 34 కోట్లకు అమ్ముడుపోయాయి. కానీ ఇప్పటివరకు ఈ చిత్రం మొదటివారంతానికి వరల్డ్ వైడ్ గా 17.77 కోట్ల షేర్ సాధించింది.
ఇక మాస్ చిత్రాలను ఏమాత్రం ఆదరించని ఓవర్‌సీస్‌లో ఈ చిత్రం 45లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే పెట్టిన పెట్టుబడిలో సగం మాత్రమే ఈ చిత్రానికి వచ్చాయి. మరో వారం పాటు మాత్రమే ఈ చిత్రం థియేటర్లలో ఉండే పరిస్థితి ఉంది. ఈ ఫుల్‌రన్‌లో కూడా ఈ చిత్రం కేవలం 20కోట్ల పైసా వసూల్‌ని మాత్రమే సాధించే అవకాశం ఉంది. దీంతో ఈచిత్రాన్ని కొన్నవారికి సగానికి సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ చిత్రాన్ని నిర్మించిన భవ్యఆర్ట్స్ అధినేత ఆనంద్‌ప్రసాద్ దీని ముందు నిర్మించిన మల్టీహీరోల చిత్రం 'శమంతకమణి' కూడా నష్టాలనే మిగిల్చింది. దీంతో 'పైసా వసూల్' చిత్రమైనా తమను గట్టెక్కిస్తుందని నిర్మాత భావించాడు.
ఇక ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఈ చిత్రం ప్రారంభోత్సవం రోజున సినిమాను సెప్టెంబర్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ దసరా రేసులో ఎన్టీఆర్ 'జై లవకుశ' సెప్టెంబర్ 21, మహేష్‌బాబు 'స్పైడర్' చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుండటంతో ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి ముందుగా విడుదల చేశారు. ఇప్పుడైతే కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చాయని, అదే ముందుగా అనుకున్నట్లు సెప్టెంబర్ 29న విడుదలై ఉంటే ఓపెనింగ్స్ కూడా వచ్చేవి కాదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.