తెలుగులో డైలాగ్‌కింగ్‌గా పేరొందిన సాయికుమార్ సోదరుడు రవిశంకర్‌కి కూడా డబ్బింగ్‌లో అంతే పేరుంది. ఆయన ఎన్నో చిత్రాలలోని పాత్రలకు తన స్వరంతో జీవం పోశాడు. ఇక 'అరుంధతి' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో పశుపతిగా నటించిన సోనూసూద్‌కి తనదైన డబ్బింగ్‌తో ఆయన సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచాడు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల సినీ ప్రేమికుల కళ్లన్నీ మహేష్‌బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'స్పైడర్' చిత్రంపైనే ఉన్నాయి. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతుండటం, మహేష్, మురుగదాస్‌లు కలిసి పని చేస్తూ ఉండటం, ఈ చిత్రం ద్వారా మహేష్‌బాబు తొలిసారిగా కోలీవుడ్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి.
ఇక సహజత్వం కోసం ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి మహేష్ చేతనే స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పించారు. ఇక ఈ చిత్రంలో విలన్‌గా తమిళ నటుడు, దర్శకుడు ఎస్.జె.సూర్య నటిస్తున్నాడు. ఈ చిత్రం ఒరిజినాలిటీ కోసం సూర్య పాత్రకు సూర్య చేతనే మొదట మురుగదాస్ డబ్బింగ్ చెప్పించాడు. కానీ ఎస్.జె.సూర్య డైలాగ్ డెలివరిలో తమిళయాస ఎక్కువగా ఉండటం వల్ల ఇది తెలుగు ప్రేక్షకులకు పంటి కింద రాయిలా మారింది. ముఖ్యంగా టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ పాత్ర డబ్బింగ్ యాసపై పలు విమర్శలు వెల్లువెత్తాయి.
పాటల్లో ఎక్కువగా ఇంగ్లీషు పదాలు దొర్లడం, ట్యూన్స్ కూడా తమిళ వాసనలు కలిసి ఉన్నాయనే వాదన మొదలైంది. దీంతో మురుగదాస్ 'స్పైడర్' చిత్రంలోని విలన్ పాత్ర అయిన ఎస్.జె.సూర్య పాత్రకు సాయికుమార్ సోదరుడు రవిశంకర్ చేత మరలా డబ్బింగ్ చెప్పించాడని సమాచారం. ఈ వాయిసే త్వరలో విడుదల కానున్న ట్రైలర్‌లోనూ, సినిమాలోనూ వినిపిస్తుందని తెలుస్తోంది.