చినబాబు, రాష్ట్రమంత్రి, సీఎం చంద్రబాబునాయుడు తనయుడు నారాలోకేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికలలో కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపిదే విజయమని తేల్చిచెప్పిన ఆయన మూడు రోజుల 'జలసిరికి హారతి' కార్యక్రమం ప్రారంభించగానే ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు వర్షాలు కురుస్తున్నాయని, ఇది దైవసంకల్పమన్నారు. గోదావరి -కృష్ణ నదుల అనుసంధానం చేసి చూపించామని లోకేష్‌బాబు సగర్వంగా ప్రకటించారు.
రాష్ట్రంలో ఐదు లక్షల పంట కుంటలను తవ్వాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 23 ప్రాజెక్ట్‌లను నిర్మించి రాయలసీమను రతనాల సీమగా మార్చి చూపిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. పట్టిసీమ వద్దన్న ప్రతిపక్షనేత జగన్‌ను ప్రజలు నిలదీయాలని కోరారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఆయన 'జలసిరికి హారతి' కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికలు తమకు నూతనోత్తేజాన్నిచ్చాయమని ఆయన తెలిపారు.
అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తమ విజయానికి బాగా ఉపయోగపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఎప్పుడు లేనంత ఉత్సాహంగా మంత్రి నారా లోకేష్ నూతనోత్తేజంతో కనిపిస్తూ ఎంతో ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగుతున్నారని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.