మెగాబ్రదర్ నాగబాబు పాజిటివ్ థింకర్. అలాగే తానేమనుకుంటే అదే ఓపెన్‌గా చెప్పేస్తాడు. తాజాగా ఆయన మాట్లాడిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో అందరికీ వాక్ స్వాతంత్య్రం ఉంది. ఈ ప్రపంచంలో మనకు మాత్రమే వాక్‌స్వాతంత్య్రం ఉందని భావించకూడదు. ఈ ప్రపంచంలోని కోట్లాది జీవరాశుల్లో మనం కూడా ఒకరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను రోడ్డు మీద నడుస్తుంటే ఓ కుక్క అరుస్తుంది. నిజానికి ఆ కుక్క అలా అరవడం నాకిష్టం లేదు. కానీ కుక్కలు, గాడిదలు అరుస్తూనే ఉంటాయి. వాటిని నియంత్రిచే ఓపిక, శక్తి మనకి ఉండదు.
మనల్ని ఎవరైనా టార్గెట్ చేస్తే స్పందించవచ్చు. కానీ ఎదుటివారికి కూడా స్పందించే హక్కు ఉందని మనం అర్ధం చేసుకోవాలి. ఒకానొక దశలో హీరోలు, రాజకీయనాయకులు ఓ చట్రంలో ఇరుక్కుపోతారు. వారు చెప్పినట్లు అభిమానులు, కార్యకర్తలు నడుచుకోవడం మాని, కార్యకర్తలు, అభిమానులు చెప్పినట్లే హీరోలు, రాజకీయ నాయకులు నడుచుకోవాల్సిన స్థితి వస్తుంది. ఎమ్జీఆర్ గురించి తప్పుగా మాట్లాడితే చెన్నైలోని అయన అభిమానులు ఎంతో వైల్డ్‌గా రియాక్ట్ అయ్యేవారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ గారు చాలా సౌమ్యులు. ఆయన ఎప్పుడు పెద్దగా ఎవ్వరినీ బాధపెట్టరు. కానీ ఆయన అభిమానులు ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే ఎంతో కోపంగా రియాక్ట్ అయ్యేవారు. అభిమానులకు నే పర్సనల్‌గా చెప్పేది ఒక్కటే.
మనల్ని అడ్డుపెట్టుకుని పబ్లిసిటీ పొందే వారు ఎందరో ఉంటారు. చాలా చిన్న విషయాలను మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే వారికి అనవసరంగా ఎనర్జీ మనమే ఇచ్చినట్లు. మనల్ని విమర్శించిన వారికి, శత్రువులకు మనం ఇచ్చే సమాధానం మన గెలుపు మాత్రమే. విన్నింగ్ ఈజ్‌ది బెస్ట్ రివేంజ్. మనకు ఇష్టం లేని అంశాలు కనపడకూడదు.. వినపడకూడదు అంటే వీలు కాదు. మనం ప్రపంచంలో ఉన్నప్పుడు మనకి ఇష్టం లేనివి ఎన్నో జరుగుతుంటాయి. ఇష్టం లేనివి జరగకూడదు అనే దానిలోనే కష్టం ఉంది. మనం విజేతలుగా నిలిచి ఎదుటి వారి విమర్శలకు సమాధానం చెప్పాలి.. అంటూనాగబాబు చెప్పుకొచ్చారు.