బాహుబలిలో భళ్లాలదేవగా అదరగొట్టేసిన రానా ఇప్పుడు తన పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడనే విషయం 'ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి' సినిమాల ద్వారా స్పష్టంగా అర్ధమైంది. 'నేనే రాజు నేనే మంత్రి'లో రాధను ప్రేమించే జోగేంద్ర గా... అలాగే రాధా కోసం ఏపనైనా చేసే జోగేంద్ర పాత్రలో అదరగొట్టేశాడు. ఇకముందు నటించబోయే సినిమాల్లో కూడా విభిన్న పాత్రల్లో కనిపించాలని రానా అనుకుంటున్నట్లుగా అతను ఎన్నుకుంటున్న పాత్రల బట్టి అర్ధమవుతుంది. బాహుబలి తరహాలోనే చారిత్రక నేపథ్యం, అలాగే పౌరాణిక పాత్రలకు రానా ఇకముందు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.
గుణశేఖర్ దర్శకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకుంటున్న హిరణ్యకశ్యప పాత్రలో రానా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా మంచు మోహన్ బాబు నేతృత్వంలో తెరకెక్కబోయే 'రావణ' లో కూడా రానా ఒక ప్రాధాన్యత గల పాత్ర పోషించబోతున్నాడని టాక్. మోహన్ బాబు ఎప్పటినుండో 'రావణ' సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటికే మోహన్ బాబు 'రావణ' స్క్రిప్ట్ మీద పూర్తి దృష్టి పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఆ 'రావణ' సినిమాలో మోహన్ బాబు రావణుడిగా నటిస్తాడని సమాచారం. అయితే 'రావణ'లో అతి ముఖ్యమైన పాత్ర ఆంజనేయుడు. ఈ పాత్రని రానా చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది.
ఇక ఈ మంచు ఫ్యామిలీ సినిమా 'రావణ' ని భక్తిరస చిత్రాలకు పెట్టింది పేరైన రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందంటున్నారు. మరొకవైపు ఈ 'రావణ' సినిమాతోనే మోహన్ బాబు దర్శకుడిగా కూడా మారబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ 'రావణ' లో కొంతమంది బాలీవుడ్ నటులు కూడా నటించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ లో ఆంజనేయుని పాత్రకి రానా ఫిక్స్ అయినట్టే అని గట్టిగా వినబడుతుంది.