లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో భారీ బడ్జెట్ తో శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న '2.0' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన '2.0' చిత్ర బృందం ఇప్పుడు పబ్లిసిటీ సన్నాహాలపై దృష్టి సారించింది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది మొదట్లో అంటే జనవరి నెలాఖరున విడుదల చేస్తామని '2.0' మేకర్స్ ప్రకటించారు. అయితే కొత్తగా గత రెండు రోజుల నుండి '2.0' చెప్పిన టైం కి పూర్తికాకపోవచ్చు... అనుకున్న టైం కి విడుదల కాకపోవచ్చు అంటూ గాసిప్స్ బయలు దేరాయి.
అయితే ఆ గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ దర్శకుడు శంకర్ '2.0' కచ్చితంగా వచ్చే ఏడాది జనవరి 25 కే వస్తుందని ప్రకటించడమే కాకూండా '2.0' ఆడియో వేడుకను భారీ లెవల్లో వచ్చే నెలలో దుబాయ్ లో నిర్వహిస్తున్నామని కూడా చెప్పాడు. అంతే కాకుండా నవంబర్ నెలలో టీజర్ విడుదల కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ లో గ్రాండ్ గా చేస్తామని చెప్పిన శంకర్, చెన్నైలో '2.0' ట్రైలర్ ని డిసెంబర్ లో అదిరిపోయే లెవల్లో విడుదల చేస్తామని ప్రకటించాడు. సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై హైప్ తీసుకురావడానికి గాను ఇలా నెలకో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేసింది '2.0' చిత్ర బృందం.
మరి ఈ సినిమాకి హాలీవుడ్ స్టయిల్లో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రజినీకాంత్ కి జోడిగా హాట్ భామ అమీ జాక్సన్ నటిస్తుండగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం ఇండియాలోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతూ రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతోంది.