సాధారణంగా ఎమ్మెల్యేలు 24 గంటలూ ప్రజలకు, ఇతర నాయకులకు అందుబాటులో ఉంటేనే ఆయా నియోజకవర్గాల్లో గ్రూప్‌లు ఏర్పడుతుంటాయి. ఇక దూరంగా తన సినిమాల బిజీలో ఉండే బాలయ్య నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు పెచ్చుమీరడంలో వింతేమీ లేదు. తాజాగా బాలకృష్ణ తన హిందూపూర్ నియోజకవర్గంలోని గ్రూప్ రాజకీయాలు, అభివృధ్ది కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, ఇతర స్థానిక నాయకులు, మండల స్థాయి నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా చిల్లమత్తూరు నాయకులు, ప్రజా ప్రతినిధులతో బాలయ్య అరగంటకు పైగా సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ది, సంక్షేమ పథకాలను దగ్గరకు చేరేలా,అందరికీ అందేలా చూడటం నా ఆశయం, తపన. అందుకు మీరు కలిసి వస్తే రండి. లేదంటే వెళ్లిపోండి అని కొందరు స్థానిక నేతలపై బాలయ్య అసహనం వ్యక్తం చేశాడు. హిందూపూర్‌కి చెందిన మండలంతో సంబంధం లేని నాయకుల జోక్యం వల్లనే తమ మండలంలో గ్రూప్‌రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని కొందరు ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. మరికొందరు కిందటి ఎన్నికల్లో మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి, ఇప్పుడు మన పార్టీలోకే వచ్చి పెత్తనం చేస్తున్న కొందరి వల్ల ఈ గ్రూప్ తగాదాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ అన్ని మండలాల నేతలతో వాస్తవ పరిస్థితులను గూర్చి చర్చించి, మీ మండల రాజకీయాలలో ఇతరులు జోక్యం లేకుండా నేను చూస్తాను. కానీ మీరందరు ఒకే మాట మీద నిలబడి నాకు అభివృద్దిలో సహకరిస్తే సరే సరి.. లేకుంటే పార్టీని వీడి వెళ్లిపోవచ్చని కుండ బద్దలు కొట్టడంతో నాయకులంతా ఇకపై మీ మాట ప్రకారమే నడుస్తామని, ప్రజలను అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ సమస్య కాస్త తీరింది. కాగా బాలయ్య మండల వారీగా నేతలతో సమావేశం సందర్భంగా అక్కడి వాతావరణంలో టెన్షన్ ఏర్పడింది.
మంచినీటి సమస్య, రోడ్ల నిర్మాణం, గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకురావడం, కూరగాయల మార్కెట్‌ను త్వరిగతిన పూర్తి చేయడం, రైల్వే లైన్ల వెడల్పు వంటి పలు అభివృధ్ది కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అభివృద్ది కార్యక్రమాల్లో మీరు ముందుకు వెళ్లండి... మీకు అండగా నేనుంటాను.. అని వారికి ఎమ్మెల్యే బాలకృష్ణ భరోసా ఇచ్చారు.