తన జీవితంలో సినిమా దశ ముగిసిపోయిందని నాటి స్టార్ హీరోయిన్, నిన్నటి డ్రీమ్‌గర్ల్, ప్రస్తుతం బిజెపి ఎంపీ హేమమాలిని స్పష్టం చేశారు. త్వరలో సినర్జి 2017 పేరిట ముంబైలో హేమమాలిని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా జీవితంలో సినిమా దశ ముగిసిపోయింది. సినిమాలలో నటిస్తున్నావా? అని పలువురు పార్లమెంట్‌లో అడుగుతూ ఉంటారు. నేను నటించిన 'బాగ్‌బన్' వంటి చిత్రం వస్తే తప్పకుండా నటిస్తాను. లేదంటే ఇక సినిమాల జోలికి వెళ్లను. కానీ నా నాట్యప్రదర్శనలను మాత్రం ఆపను. కేంద్రమంత్రి పదవి గురించి నన్ను తరచుగా కొందరు అడుగుతూ ఉంటారు. నాకు మంత్రి అయ్యే అర్హతలేదని నా అభిప్రాయం.
ప్రస్తుతం నాకున్న బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నాను. అంతకు మించి ఎలాంటి కోరికలు లేవు. కళారంగంలో నావంతు కృషి చేయాలని ఉంది. నేను మంత్రినైతే ఇక ప్రజలు నన్ను కలిసే అవకాశం ఉండదు. ఓ ఎంపీగా నేను చేయగలిగినంత కృషి చేస్తున్నాను. అదే సంతోషంగా ఉంది. నా నియోజకవర్గమైన మధురలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయాలని ఉంది. అది జరిగే వరకు నాకు మనశ్శాంతి లేదు... అని నిన్నటితరం డ్రీమ్‌గర్ల్ చెప్పుకొచ్చింది.