నేటి రోజుల్లో ప్రతిది కులం, రాజకీయం రంగు పులుముకుంటోంది. హీరోల ప్రమేయం లేకపోయినా వారి అభిమానులు, వారి సామాజిక వర్గ వ్యక్తులు ఈ ఫ్లెక్సీల కుంపటిని రాజేస్తున్నారు. కొన్ని సార్లు ఇవి తీవ్ర గొడవలకు, ఉద్రిక్తతలకు, ఒకరిని ఒకరు ప్రాణాలు తీసుకునే దాకా వెళ్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తూర్పుగోదావరి జిల్లా, కాట్రేని కోనలో జరిగింది. ఇక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం ఎదుట చవితి మండపం ఎదురుగా మహేష్‌బాబు, కొందరు రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అయితే స్థానికులు దీని వల్ల ఉద్రిక్తతలు తలెత్తుతాయని పోలీసులకు, పంచాయతీ, రెవిన్యూ సిబ్బందికి విషయం తెలిపారు. దాంతో ఆయా అధికారులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. కానీ తాజాగా గణపతి మండపం వద్ద అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా మరలా మహేష్ అభిమానులు తమ హీరో ఫ్లెక్స్‌లను, రాజకీయ నాయకుల ఫ్లెక్స్‌లను ముందుగా అధికారులు తొలగించిన చోటనే మరోసారి ఏర్పాటు చేశారు. దీంతో ఇది రెండు సామాజిక వర్గాల మద్య ఉద్రిక్తతకు దారితీసింది.
తమ హీరో ఫ్లెక్సీలను తొలగిస్తే, మరికొందరు తమ ఇళ్లపై పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, వాటిని కూడా తొలగించాల్సిందేనని మహేష్ అభిమానులు పట్టుబట్టారు. దాంతో తమ ఇళ్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని ఆ ఇంటి యజమానులను అధికారులు ఆదేశించారు. అయితే ఆ ఇంటి యజమానులు కేవలం బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలపై మాత్రమే నిబంధనలు ఉన్నాయని, సొంత ఇళ్లపై ఏర్పాటు చేసుకునే ఫ్లెక్సీలపై ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు లేవని వారు అధికారులకు తెలిపారు. దాంతో తమ ఇంటిపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు పంచాయతీకి చలానా కట్టాలని అధికారులు ఆ ఇంటి యజమానులను ఆదేశించారు. మొత్తానికి ఈ రెండు సామాజిక వర్గాల మద్య ఏర్పడిన ఉద్రిక్తత.. పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది. దీనికి సంబంధించిన ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు.