ఎవరైనా సరే.. అది అమితాబ్‌బచ్చన్, చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, కమల్‌హాసన్.. ఇలా సినిమాలలో ఓ స్థాయికి ఎదిగి ఇక నటునిగా రిటైర్‌మెంట్ తీసుకునే వయసు వస్తే, ఇంకా కుర్రహీరోలలాగా గంతులు, గెంతులు తమ నుంచి ప్రేక్షకులు ఆశించరు అని తెలిసిన తర్వాత వారి చూపు రాజకీయాలపైనే పడుతుంది. ఇక లోకనాయకుడు కమల్‌హాసన్ విషయానికి వస్తే ఆయనకు మహా కోపం. తాను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనని, ఏదైనా మొహానే మాట్లాడే తనకు రాజకీయాలు సరిపడవని ఆయన ఆ మద్య ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
మీడియా, తన అభిమానులు దయచేసి తాను రాజకీయాలలోకి వస్తున్నాననే ప్రచారాన్ని ఆపాలని సూచించాడు. మరోపక్క రజనీకి మైక్ కనిపిస్తే చాలు ఏదేదో మాట్లాడుతాడని చెప్పాడు. ఇక ఆయన నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా తమిళనాడుకు చెందిన చిదంబరం, తమిళనాడులో జయలలిత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కమల్ ఓ సమావేశంలో ఈ పంచెకట్టు కట్టుకున్న నిజమైన తమిళుడు ఎప్పటికైనా ప్రధానమంత్రి అవుతాడని చిదంబరంని పొగుడుతూ పలు వ్యాఖ్యలు చేశాడు. నాడు ప్రధాని కావాలని భావిస్తున్న జయ, అందునా తన రాజకీయ ప్రత్యర్థి చిదంబరంను కమల్ అలా పొగడటంతో మండిపడింది. దాంతో ఆయనకు 'విశ్వరూపం' చిత్రం విడుదలలో చుక్కలు చూపించింది.
ఇక తాజాగా కమల్‌హాసన్‌ని నాటి స్టార్ హీరోయిన్, నేడు కాంగ్రెస్ నేత అయిన నగ్మా ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించింది. పనిలో పనిగా రజనీకాంత్ విషయం కాసేపు మాట్లాడుకుని కమల్‌ని కాంగ్రెస్‌లోకి రమ్మని ఆహ్వానించింది. ఇక కమల్ గత కొంతకాలంగా అంటే జయలలిత మరణం తర్వాత తమిళ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంపై కూడా మండిపడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్న తీరుని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టాల్సిందిగా ఆయన ప్రజలకు, తన అభిమానులకు సందేశాలు ఇస్తున్నాడు.
తనను ప్రశ్నించిన కొందరు రాజకీయనేతలతో తాను ఎప్పుడో రాజకీయాలలోకి అడుగుపెట్టానని స్టేట్‌మెంట్ ఇచ్చి సంచలనం రేపాడు. ఇక సోషల్ మాధ్యమాలలో, మీడియాలో, తాను హోస్ట్ చేస్తున్న 'బిగ్‌బాస్'షో లో కూడా ఆయన రాజకీయాలపై మాట్లాడుతూ, తాను రాజకీయాలలోకి వచ్చే ఎన్నికలలోపు రావడం ఖాయమనే పరోక్ష సంకేతాలు అందిస్తున్నాడు. మరి లోకనాయకుడి పరిస్థితి ఇలా ఉంటే అసలు సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి సంబంధించిన ఏ రాజకీయ విషయం బయటకురావడం లేదు. కమల్ కాంగ్రెస్‌లో చేరి, రజనీ బిజెపిలో చేరితే ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీల హవా కొనసాగిన తమిళనాట రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచిచూడాల్సివుంది...!