తనపై, తాను చేసిన సినిమాలపై తానే సెటైర్లు వేసుకునే వారిలో ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటాడో, ఎప్పుడు బోళాశంకరుడుగా ఉంటాడో.... ఎప్పుడు ఉగ్రనేత్రునిగా మారుతాడో తెలియని వారిలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకరు. ఆయన నటించే చిత్రాలలోని కొన్సి సీన్స్ ఎంతో పవర్‌ఫుల్‌గా చేసినా అవి ఆయన వీరాభిమానులకు కూడా నవ్వును తెప్పిస్తాయి. ఆయన బి.గోపాల్ దర్శకత్వంలో నటించిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' చిత్రంలో తొడ గొడితే రైలు వెనక్కి వెళ్లిపోయే సీన్ ఒకటి ఉంటుంది. మరో సినిమాలో ఏదో పవర్‌ఫుల్ రేంజ్‌లో ఆయన కొండని ఎక్కుతుంటాడు. అక్కడికి ఎక్కి చివరకు కుందేలు పిల్లను కాపాడుతాడు. ఇలాంటివి బాలయ్య చిత్రాలలోనే ఎక్కువగా కనిపిస్తాయి.
ఈ విషయమై ఓ జర్నలిస్ట్ దర్శకుడు బి.గోపాల్‌ని 'పల్నాటి బ్రహ్మనాయుడు' సీన్‌లో తొడగొడితే రైలు వెనక్కి వెళ్లిపోయే సీన్ చూసి అభిమానులు కూడా నవ్వుకుంటున్నారు. సామాన్య ప్రేక్షకులకే ఆసీన్ నవ్వు తెప్పించేదిగా ఉంటే మీరు, మీతోపాటు ఎన్నో సినిమాల అనుభవం ఉన్న రచయితలు, ఎడిటర్లు ముందుగా ఈ సినిమాని ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఇలాంటి సన్నివేశాలు నవ్వుల పాలవుతాయని ఎందుకు గ్రహించరు? అని అడిగితే దానికి బి.గోపాల్ సమాధానం ఇస్తూ, నా మనసుకు నాకు ఆ విషయం తెలుసు. కానీ బాబు చుట్టూ ఉండే భజన బృందం ఫలానా స్టార్‌ని ఇంత పవర్‌ఫుల్‌గా చూపించారు. కాబట్టి మన బాబుని అంతకంటే పవర్‌ఫుల్‌గా చూపించాలి.. అని చెబుతూ, అంటే భజన చేస్తూ బాలయ్యను తప్పుదారి పట్టిస్తుంటారు. అందువల్లే అలాంటి సీన్స్‌ని ఇష్టంలేకపోయినా తీయాల్సివచ్చింది అని చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా జెమిని టీవీలో రానా హోస్ట్ చేస్తున్న 'నెంబర్ వన్ యారీ'లో బాలయ్య పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 'ఒక్కమగాడు' ప్రస్తావన వచ్చింది. ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని ఎప్పుడైనా భావించారా? అని అడిగితే.. అవును.. కమల్‌హాసన్ గారు చేసిన తర్వాత ఆ గెటప్‌ని వేసుకుని చేయకుండా ఉండాల్సింది అని భావించిన చిత్రం 'ఒక్కమగాడు' అని సమాధానం ఇచ్చాడు. దీన్ని బట్టి బాలయ్య బోళాతనం అర్ధమవుతుంది. ఇతర హీరోలకు కూడా ఇలాంటి చిత్రాలు వారి కెరీర్‌లో కొన్ని ఉంటాయి. కానీ బాలయ్యలా వారు ఓపెన్‌గా చెప్పరు. అందుకే సంతోషంగా ఉన్నప్పుడు బాలయ్యని బోళాశంకరుడు అని అందరూ అంటారు.