కొందరు కొన్ని విషయాలను సెంటిమెంట్‌గా, భక్తిగా భావిస్తుంటారు. అందులో ఒకటి హైదరాబాద్ శివార్లలో ఉన్న బాలాపూర్ గణపతి స్వామి లడ్డూ. ఈ లడ్డుకి ఎంతో ఘన చరిత్ర ఉంది. అసలు ఇలా వినాయకస్వామి లడ్డూను వేలం వేసి, వాటిని భక్తులు దక్కించుకునే సంప్రదాయం బాలాపూర్ నుంచే మొదలైందని అంటారు. ఇక బాలాపూర్ లడ్డును మొదటగా 1994లో వేలం వేయగా 454 రూపాయలు పలికింది. ఇదే లడ్డు 2016కి వచ్చేసరికి 14.65 లక్షలు పలికింది. ఈసారి ఈ బాలాపూర్ లడ్డు కిందటి ధర అయిన 14.65 లక్షల కంటే ఏకంగా 96వేల రూపాయలు ధర అధికంగా పెరిగింది.
ఈ లడ్డూను వనపర్తి జిల్లా నాగాపూర్ నివాసి అయిన నాగం తిరుపతి రెడ్డి అనే భక్తుడు ఈ అత్యధిక ధరకు లడ్డూని వేలంలో దక్కించుకున్నాడు. బాలాపూర్ లడ్డూని దక్కించుకుంటే తమ ఇంటిలో లక్ష్మీదేవి కొలువుంటుందని, అష్టైష్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. కాగా నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, బాలాపూర్ గణపతి లడ్డూని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. జీవితంలో ఒకసారైనా బాలాపూర్ లడ్డును దక్కించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఇన్నాళ్లకు ఆ కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశాడు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. మొత్తానికి బాలాపూర్ గణేషుని లడ్డు ఏ యేటికాఏడు ధర పెరుగుతూ తన విశిష్టతను చాటుకుంటూ ఉండటం గమనార్హం.