నిజానికి పెద్ద పెద్ద పోట్లాటల కన్నా చిన్న చిన్న బెదిరింపులే అనుకున్నవి జరిగేట్టు చేస్తాయి. వెయ్యిసార్లు యుద్దం చేయడం కంటే ఒకే మాటతో ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి ఎదుటివారిని జయించగలం అని సమంత నిరూపించింది. ఇక విషయానికి వస్తే గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేశావే' చిత్రం సమయంలోనే హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంతలు లవ్‌లో పడ్డారు. కానీ దానిని చాలా కాలం దాచి గతేడాది అసలు విషయం బయటపెట్టారు. ఆ తర్వాత పెద్దలను కూడా ఒప్పించి ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్ధం చేసుకున్నారు. ఈ జంట వివాహం అక్టోబర్ 6,7 తేదీలలో గోవాలో జరగనుంది.
మరోవైపు 'రారండోయ్ వేడుకచూద్దాం'తో తన కెరీర్‌లోనే పెద్ద హిట్ కొట్టిన నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'యుద్దం శరణం' మూవీ ఈనెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుండగా, కృష్ణమరిముత్తు అనే నూతన దర్శకుడు ఈచిత్రం ద్వారా డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నాగచైతన్య, హీరోయిన్ లావణ్యత్రిపాఠిలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత నాగచైతన్యని మీరు ఎప్పుడైనా దేని కోసమైనా యుద్దం చేశారా? అని అడగగా, నాగచైతన్య సమాధానం ఇస్తూ పెద్దగా యుద్దాలేమీ చేయలేదు.
కానీ చెన్నైలో ఉన్నప్పుడు స్కూల్ చదువు కోసం హైదరాబాద్ రావాల్సివచ్చింది. ఆ సమయంలో మా అమ్మతో కాస్త యుద్దం చేయాల్సివచ్చింది. సమంత విషయంలో ప్రేమ కోసం కూడా యుద్దం చేశాను. మన ప్రేమ విషయం ఇంట్లో చెబుతావా? లేదా? లేకపోతే నేనే నీకు రాఖీ కట్టాల్సివస్తుంది. వేరే ఆప్షన్ లేదు.. అంటూ సమంత బ్లాక్‌మెయిల్ చేయడం, చైతూ ఇంట్లో పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పడం జరిగిందట. మొత్తానికి చూడటానికి ఎంతో అమాయకంగా ఉండే సామ్ తన ప్రేమను ఇలా గెలిపించుకోవడం చూస్తే వేయి రక్తపు చుక్కల కన్నా, ఓ ఎమోషనల్ మాట చాలని ఒప్పుకోవాల్సిందే....!