కాంట్రవర్సీలతో 'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలైనప్పటికీ... విడుదలైన తర్వాత 'అర్జున్ రెడ్డి' చిత్రం యూత్ కి కనెక్ట్ అవడమూ... సినిమా మొత్తంలో యూత్ అంతా 'అర్జున్ రెడ్డి' లో తమని తాము చూసుకోవడము జరిగిపోయాయి. కలెక్షన్స్ పరంగా కూడా 'అర్జున్ రెడ్డి' దెబ్బ గట్టిగా తగిలింది. సినిమాలో ఎంతగా వల్గారిటీ ఉన్నప్పటికీ... సినిమా మాత్రం కుర్రకారుకి విపరీతంగా ఆకర్షించడంతో సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఇక అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్ కోసం పలు భాషల హీరోలు పోటీ పడడం చూస్తుంటే 'అర్జున్ రెడ్డి' క్రేజ్ ఇతర భాషలకు ఎలా పాకేసిందో అర్ధమవుతుంది.
మరి అన్ని సమస్యలు అధిగమించినట్లే కనబడుతున్న 'అర్జున్ రెడ్డి' చిత్రం ఇప్పుడు శాటిలైట్ రైట్స్ విషయానికొచ్చేసరికి మాత్రం తడబడుతున్నాడట. మరి వెండితెర మీద బంపర్ హిట్ అవడమే కాదు పలు భాషా హీరోలు రీమేక్ రైట్స్ కి పోటీ పడడం చూసిన వారికి ఈ 'అర్జున్ రెడ్డి' శాటిలైట్ రైట్స్ అమ్ముడవలేదంటే కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి వెండితెర మీద హిట్ అయిన ఈ 'అర్జున్ రెడ్డి'ని రెండు మూడు కోట్లు పెట్టి శాటిలైట్ హక్కులు కొనడం ఏ ఛానల్ కి పెద్ద విషయం కాకపోయినప్పటికీ... బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాని ఛానెల్ లో ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేయడం మాత్రం ఇబ్బందే ఎదురవుతుందనే ఉద్దేశ్యంలో... చాలా ఛానల్స్ ఇప్పుడు ఆలోచనలో పడ్డాయట.
మరి 'అర్జున్ రెడ్డి' మీద సెన్సార్ నిర్ణయం ఎలా వుందో ఏ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడే అర్ధమయ్యింది. అలాగే ఇప్పటికి 'అర్జున్ రెడ్డి' మీద మహిళలు విరుచుకుపడుతూనే ఉన్నారు. మరి ఇలాంటి టైం లో అర్జున్ రెడ్డి శాటిలైట్స్ రైట్స్ అమ్మాలంటే మరోమారు చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డు కి వెళ్లాల్సిందే. మరి ఇప్పటికే వెండితెర కి ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు ఇప్పుడు ఛానల్స్ లో ప్రచారం చెయ్యాలంటే మరిన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేసి పారేసి యు/ఏ సర్టిఫికెట్ ఇస్తేనే అది టీవీ ఛాన్స్ వాళ్ళు ప్లే చేయగలుగుతారు. కేవలం కొన్ని డైలాగ్స్ మాత్రమే కాదు ఏకంగా కొన్ని సీన్సే తీసేయాల్సి ఉంటుంది. మరి ఇన్ని లేపేసాక ఏ ఛానల్ మాత్రం ఈ సినిమాని తీసుకుని ఏం చేస్తుంది. అయితే ఎలా ఉన్నా 'అర్జున్ రెడ్డి' ని దక్కించుకునేందుకు ఓ ఛానల్ కాసుక్కూర్చుందంటున్నారు.