రాబోయే రోజుల్లో ప్రజలకు దేవుడంటే భయం, పెద్దలంటే గౌరవం, ఆచారం, వ్యవహారాలు ఏమీ ఉండవని, దీనిని కలికాలం అంటారని మన పెద్దలు చెబుతుంటారు. తాజా సంఘటన చూస్తే ఆ కలికాలం ఇదేనని అందరికీ ఓసారి అనిపిస్తుంది. సాధారణంగా మన దేశంలోనే కాదు.. మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వినాయక చవితిని ఎంతో గొప్పగా, ఘనంగా చేసుకుంటారు. భక్తిశ్రద్దలతో చేసుకునే ఈ పండుగ సందర్భంగా బాలాపూర్ తరహాలో వినాయకునికి భారీ లడ్డును ప్రసాదంగా, నైవేద్యంగా పెట్టి, చివరి రోజులో దానిని వేలు, లక్షల డబ్బులను పెట్టి కొంటారు. అలా వినాయకుని లడ్డూని దక్కించుకునే వారింట లక్ష్మీ, సరస్వతి, కుబేర కటాక్షం ఉంటాయని భక్తులు నమ్మి లడ్డూని లక్షలు పెట్టి వేలం పాటలో సొంతం చేసుకుంటారు.
ఇక విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు పట్టణంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా దేవునికి నైవేద్యంగా పెట్టిన లడ్డూని దొంగలు దొంగిలించుకుని పోయారు.ఈ లడ్డూతో పాటు దేవుని మెడలో వేసిన రెండు వేల రూపాయల నోట్లను కూడా వారు అపహరించారు. ఈ సంఘటన ఇల్లెందులోనే కాదు... జిల్లా అంతటా సంచలనం సృష్టించింది. భక్తితో ప్రసాదం తీసుకునే రోజులు పోయి, దేవుని నైవేద్యమైన లడ్డూల దొంగతనం కూడా జరుగుతుంటే ఈ కాలాన్ని కలికాలం అనకుండా ఏమనాలో చెప్పండి...! అది సంగతి...! దేవుడి నైవేద్యానికే భద్రత లేకపోతే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడిది? దేవుడు తన ప్రసాదాన్నే కాపాడుకోలేకపోతే ఇక భక్తుల మొక్కులను ఎలా తీరుస్తాడు? అంటూ పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు.