గత కొంతకాలంగా హీరోయిన్ తాప్సి పలురకాలుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై కొబ్బరిచిప్పల కామెంట్లు తీవ్ర దుమారాన్నే లేపాయి. దీంతో తెలుగువారందరూ ఈ అమ్మడిని నానా విధాలుగా టార్గెట్ చేశారు. మొదట్లో తానేమీ తప్పు మాట్లాడలేదని, ఈ విషయంలో తాను ఎవ్వరికీ క్షమాపణ చెప్పనని భీష్మించుకుని కూర్చున్న తాప్సి దాని తర్వాత తాను నటించిన 'ఆనందో బ్రహ్మ' చిత్రం విడుదల కానున్న నేపద్యంలో యూనిట్ వారి సొద తట్టుకోలేక కేవలం దర్శకేంద్రునికి మాత్రమే తాను సంజాయిషీ ఇస్తున్నానని చెప్పి, ఓ సారీ పడేసింది.
ఇక ఈ అమ్మడు ఎన్నో తెలుగు చిత్రాలలో నటించినా ఆమెకు ఒక్క హిట్ కూడా రాలేదు. దాంతో ఆమె 'ఆనందోబ్రహ్మ' చిత్రం చేయడానికి ఒప్పుకుని, మహా అయితే తనకు ఓ ఐదారు లక్షలు మాత్రమే ఇస్తారని భావించి, దైర్యంగా, కాస్త తెలివిగా ఓ కండీషన్‌పై ఈ చిత్రం చేసింది. స్టార్ హీరోల రేంజ్‌లో ఈ అమ్మడు తాను ఈచిత్రంలో ఉచితంగా నటిస్తానని, కానీ చిత్రం విడుదలై లాభాలు వస్తే మాత్రం తనకు వాటా ఇవ్వాలని కండీషన్ పెట్టి ఈ చిత్రంలో నటించింది. మామూలు రెమ్యూనరేషన్‌గా తీసుకుని ఉంటే అసలు డిమాండ్ లేని ఈ భామకు మహా అయితే ఐదారు లక్షలు వచ్చేవి.
కానీ ఈ చిత్రం ఆర్థికంగా బాగా వర్కౌట్ కావడం, బాగా లోబడ్జెట్ మూవీ కావడంతో సక్సెస్ టాక్‌ని తెచ్చి నిర్మాతలకు బాగానే లాభాలను సంపాదించి పెడుతోంది. ఇప్పుడు లాభాలలో వాటా కింద ఈమెకు దాదాపు 30 నుంచి 50లక్షలు వచ్చే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మంచి డబ్బుతో పాటు సినిమాపై నమ్మకంతో ఆమె ఉచితంగా నటించడానికి ఒప్పుకోవడం పట్ల ఆమెకు ప్రశంసల వర్షం కూడా కురుస్తోంది. ఈ విధంగా ఒకే దెబ్బకు రెండు పిట్టలను తాప్సి కొట్టిందనే చెప్పాలి.