దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో మత ఆచారం ఉంటుంది. బయటివారికి ఆ ఆచారాలు వింతగా, నిరక్షరాస్యులు చేసేవిగా కనిపించినా, ఆ ప్రాంత ప్రజలు మాత్రం దానిని వేదవాక్కుగా భావిస్తారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే అక్కడ నాస్తికులు ఎందరో, పరమ బీభత్సమైన నమ్మకం కలిగిన భక్తులు కూడా అంతేమంది ఉంటారు. చర్మానికి శూలాలు తగిలించుకుని రథాలు లాగడం, జల్లికట్టుతో సహా అక్కడ కొన్ని ఆచారాలు గగుర్పాటు కలిగించేవిగా ఉంటాయి. ఆస్థికులు, ఆ దేవుళ్లను పూజించే భక్తులు మాత్రం అక్కడ తమ మొక్కులను ఎంత కఠినతరమైనవైనా తీర్చేసుకుంటారు.
ఇక తమిళనాడులోని కృష్ణరాయపురంలో మహలక్ష్మి అమ్మన్ ఆలయం ఉంది. ఈ దేవాలయంలో పురాతన కాలం నుంచి ఓ ఆచారం ఉంది. ఇప్పటికీ అక్కడికి పలు సుదూర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ మొక్కు అంటే ముందుగా ఈ దేవాలయ పూజారిని భక్తులు మొదట కలుస్తారు. అప్పుడు ఆ భక్తులు తెచ్చిన కొబ్బరికాయను పూజారి ఆ భక్తుడి తలపై కొట్టి పగులకొడతాడు. ఆ తర్వాత మాత్రమే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. దీని వల్ల తమ ఆరోగ్యం బాగా ఉంటుందని, తాము దేవతను కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీని ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందినట్లుగా భావించిన భక్తులకు కొబ్బరికాయను తలపై పగులగొట్టిన చోట పసుపు రాస్తారు. దీని వల్ల గాయం తొందరగా మానిపోతుందని భక్తులు నమ్ముతారు. కొంత మంది భక్తులకు తీవ్రంగా తలపై గాయాలైనప్పటికీ వారు ఆ బాధను ఓర్చుకుని హాస్పిటల్‌కి వెళ్లి చికిత్స పొందుతారు. ఈ ఆలయంలో ఈ ఆచారం బ్రిటిష్ కాలం ముందు నుంచి వస్తోంది. దీనికి సంబంధించిన ఓ స్థలపురాణం కూడా అక్కడి ప్రజలు చెబుతారు.
బ్రిటిష్ వారు పాలన చేసే సమయంలో ఆ ఊరి నుంచి రైల్వే ట్రాక్‌ని వేయాలని నాటి అధికారులు భావించారు. కానీ ఆ రైల్వేట్రాక్‌ని తమ ఊరి నుంచి వేయడానికి వీలులేదని ఆ గ్రామస్థులు పట్టుబట్టారు. కానీ అధికారులు రైల్వే లైన్ ప్రారంభించే సమయంలో వారికి ఓ కొబ్బరి కాయలాంటి రాయి కనిపించింది. అప్పుడు ఆ బ్రిటిష్ అధికారులు గ్రామీణులకు ఓ షరత్తు విధించారట. ఆ రాయిని తలపై కొట్టుకుని ముక్కలు చేస్తే ఆ గ్రామం నుంచి రైల్వే లైన్ వేయమని అధికారులు గ్రామస్థులకు చెప్పారు. గ్రామీణులు ఆ రాయిని తలపై కొట్టుకుని రెండు ముక్కలు చేశారు. దీంతో బ్రిటిష్ అధికారులు రైల్వే లైన్‌రూటుని ఆ గ్రామం నుంచి కాకుండా వేరే దారికి మరలించారు. అంతటి గొప్పకార్యం చేసిన ఆ గ్రామ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలు అదే ఆచారాన్ని పాటిస్తూ ఉండటం విశేషం.