అన్నదమ్ముల అనుబంధాన్ని ప్రతిబింబించేలా 'జై లవ కుశ' చిత్రాన్ని తెరకెక్కించామని చెబుతున్నాడు ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా వస్తున్న 'జై లవ కుశ' చిత్రానికి సంబందించిన ఆడియో ప్రెస్ మీట్ ని హైదరాబాద్ లో చిత్ర బృందం నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ అన్నమాటలు ఇవి. లవ, కుశ అంటే అన్నదమ్ములుగా ఎంత ప్రేమ ఆప్యాయతలను కలిగి ఉంటారో...అలాంటి ప్రేమ, ఆప్యాయతలతో పాటు చిన్న చిన్న రాగద్వేషాలు కూడా ఉంటాయని అలాంటి అన్నదమ్ముల కథతోనే ఈ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో తెరకెక్కించామని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ వేడుకకి నందమూరి హరికృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. హరికృష్ణ మాట్లాడుతూ అన్నదమ్ముల కథతో సినిమా తియ్యడమే కాదు అన్నదమ్ములిద్దరూ ఈ సినిమా కోసం పనిచేయడమే ప్రత్యేకమని చెప్పడమేకాకుండా... గతంలో నేను బాలకృష్ణ కూడా ఇలానే పనిచేశామని పాత రోజులు గుర్తు తెచ్చుకున్నారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై తాను నిర్మాతగా సినిమా తెరకెక్కిస్తే, ఆ సినిమాలో తన తమ్ముడు బాలకృష్ణ నటుడిగా నటించాడని చెప్పిన హరికృష్ణ... మళ్ళీ ఇప్పుడు ఈతరంలో అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా ప్రొడ్యూస్ చేస్తే తమ్ముడైన ఎన్టీఆర్ అందులో హీరోగా నటించాడని హరికృష్ణ తెలిపాడు.
ఇక ఈ చిత్రాన్ని ఎంతోమనసు పెట్టి చేశానని... ట్రెండ్ ఫాలో అవుతూ చెయ్యలేదని చెప్పిన ఎన్టీఆర్ తన తండ్రి 60 వ పుట్టినరోజు కానుకగా ఈ 'జై లవ కుశ'ని ప్రేక్షకులకు అందిద్దామని ముందుగా అనుకున్నప్పటికీ మళ్ళీ 21 అయితే ఏమవుతుంది ఎప్పుడు విడుదల చేసినా ఇది మా నాన్నగారికోసమే మా అన్న నేను కష్టపడి చేశాము...అని చెప్పుకొచ్చాడు. ఇక దేవిశ్రీ అందించిన 'జై లవ కుశ' పాటలకు మంచి స్పందనే వస్తుంది.