నేడు యువత ఎక్కువగా ఈజీ మనీ కోసం, జల్సాలు, విలాసాలకు బాగా అలవాటు పడుతూ బెట్టింగ్‌లు, జూదం వంటి వాటికి అలవాటు పడుతున్నారు. అందులో డబ్బులు పోగొట్టుకుని చివరకు సినిమాల ప్రభావంతో కిడ్నాప్ వంటి వాటి ద్వారా డబ్బు సంపాదించడానికి పాల్పడుతున్నారు. ఇదేదో అల్లుఅర్జున్ నటించిన 'జులాయి' చిత్రంకాదు. ఇటీవల మేడ్చల్ పట్టణానికి చెందిన మణిధర్ అనే 14ఏళ్ల బాలుడుని కిడ్నాప్ చేసి ఆయన తండ్రి గిరిబాబును కొందరు కిడ్నాపర్లు 10లక్షల సొమ్మును డిమాండ్ చేశారు. కానీ ఆ బాలుడు తనను తాళ్లతో కట్టేసి, నోటికి ప్లాస్లర్ వేసి ఓ చీకటి గదిలో బంధించినా కూడా చాకచక్యంగా తప్పించుకుని వచ్చాడు. ఇక దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులో మణిధర్ సిల్వర్ కలర్ కారులో తనని కిడ్నాప్ చేశారని, ఆ కారులో డోరేమాన్ బొమ్మతో పాటు కారు వెనుక అంబులెన్స్‌కి దారి ఇవ్వండి అని రాసి ఉన్నట్లు ఆ పిల్లాడు పోలీసులకు కీలకమైన సమాచారం అందించాడు. దీంతో పోలీసులు తనిఖీలలో భాగంగా అలాంటి కారే పోలీసులకు కనిపించడంతో అందులోని వారిని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు భాగోతం బయటపడింది. బిటెక్ ఫైనలియర్ చదువుతున్న గడ్డం నాగేంద్రబాబు అలియాస్ పింటు (24), జోగిప్రసాద్‌లు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారు. వీరు రేసులు, బెట్టింగ్‌లలో చాలా నష్టపోయారు. దాంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు కిడ్పాప్‌లను ఎంచుకున్నారు.
ఆమద్య ఓ హోటల్ యజమానికి ఫోన్ చేసి 1000మందికి భోజనాలు కావాలని, తమని కలిస్తే క్యాటరింగ్ సంగతి మాట్లాడుదామని పిలిచారు. ఆ హోటల్ వ్యక్తి ఒంటరిగా రావడంతో ఆయనను చేతులు కాళ్లు కట్టేసి పొదల్లో కొట్టి ఆయన వద్ద జేబులో ఉన్న 10 వేలు, పర్సులోని 4 వేలతో పాటు సీక్రెట్ జేబులో ఉన్న లక్షరూపాయలను కాజేశారు. ఇక తమకు తెలిసిన గిరిబాబు అనే వ్యక్తిదుబాయ్ నుంచి బాగా సంపాదించి వచ్చాడని ఆయన కుమారుడు మణిధర్‌ని కిడ్నాప్ చేసి 10లక్షలు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులకు పట్టుబడి ప్రస్తుతం రిమాండ్‌లో ఉండి, కటకటాలు లెక్కించేందుకు సిద్దంగా ఉన్నారు.