సినిమా ప్రపంచం గురించి మనకు మీడియాలో చాలా వార్తలు షికారు చేస్తూ ఉంటాయి. కానీ అవి నిజం కాదని, పబ్లిసిటీ కోసం, వీక్షకుల కోసం తమపై గాలి వార్తలు రాస్తూ, తమను అడ్డుపెట్టుకుని, తమ క్రేజ్‌ని వాడుకుని మీడియా లబ్దిపొందుతోందని కొందరు అసహనం వ్యక్తం చేస్తుంటారు. కానీ సినీ రంగం పూర్తిగా తెలిసిన వారికైతే నిజంగా సినీ చీకటి కోణంలో జరిగే విషయాలను మీడియా 10శాతం కూడా బయటపెట్టడం లేదు. మీడియాకి కూడా తెలియని ఎన్నో చీకటి కోణాలు ఈ రంగంలో ఉన్నాయి.. ఉంటూనే ఉంటాయని చెప్పాలి.
అలాంటి సంఘటన గురించే తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనారౌనత్ కొన్ని విషయాలను మాట్లాడింది. ప్రస్తుతం కంగనారౌనత్ 'సిమ్రన్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా కంగనా 'ఆప్ కా అదాలత్' అనే టీవీ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె హృతిక్‌రోషన్, ఆదిత్యాపంచోలిల అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. గతంలో కొంతకాలం హృతిక్ రోషన్, కంగనా రౌనత్‌ల మధ్య ప్రేమాయణం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు విడిపోయారు.
2016లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రౌనత్ హృతిక్ గురించి మాట్లాడుతూ, 'సిల్లీ ఎక్స్' అని సంబోధించింది. దాంతో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. కొంత కాలం తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. అయితే కంగనా తాజాగా మరలా ఆ గొడవను ప్రస్తావించింది. చిన్నప్పుడు తనను ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆదిత్యాపంచోలి తీవ్రంగా, దారుణంగా కొట్టే వాడని చెప్పింది. కంగనా, హృతిక్‌ల వివాదంలో ఆదిత్యాపంచోలి హృతిక్‌కే మద్దతు పలికాడు. దాంతో హృతిక్ కంటే ఆదిత్యానే డేంజర్ అని నాకర్ధం అయింది. ఆదిత్య కూతురి కంటే నేను ఏడాది చిన్నదాన్ని. నాకు 17ఏళ్లు ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్‌లోకి వచ్చాను. సినిమాల విషయంలో ఆదిత్య నన్ను రక్తం వచ్చేలా కొట్టేవాడు. ఈ విషయంలో నాకు సహాయం చేయమని ఆయన భార్య జరీనా వాహెబ్‌ని వేడుకున్నాను. కానీ ఆమె ఇచ్చిన రిప్లై చూసి నేను షాక్ అయ్యాను.
ఆదిత్యాపంచోలి ఇంటికి రావడం లేదని, అందువల్ల నేను సంతోషంగా ఉన్నానని ఆయన భార్య చెప్పింది. దాంతో నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. పోలీసులను ఆశ్రయిద్దామని భావించాను. కానీ ఈ విషయం నా తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారని మౌనంగా ఉన్నాను.. అంటూ తాను పడిన నరకాన్ని చెప్పుకొచ్చింది. కాగా బాలీవుడ్ మీడియా ప్రకారం నాడు కంగనా రౌనత్ ఆదిత్యాపంచోలి మీద పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించింది. దాంతో పోలీసులు ఆదిత్యాని పిలిచి ఆమెకి దూరంగా ఉండమని హెచ్చరించారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు కంగనా బయటపెడుతుండటం సంచలనంగా మారుతోంది....!