పిచ్చి.. పిచ్చి.. పిచ్చి పలు విధాలు.. అందరిలో ఏదో పిచ్చి అంతర్గతంగా ఉంటుంది. తనకు ఏ పిచ్చి లేదని భ్రమపడేవాడే అసలైన పిచ్చోడు అని ఓ కవి చెప్పి ఉన్నాడు. ప్రపంచంలోని అందరిలా తాము కూడా సామాన్యంగా ఉంటే ఏం లాభం? మనకంటూ ఓ ప్రత్యేకత, గుర్తింపు ఉండాలని ఎందరో తాపత్రయ పడుతుంటారు. అందులో భాగంగా వార్తల్లో నిలవడానికి, గిన్నిస్‌బుక్ వంటి వాటిల్లో తమ పేరు ఎక్కించుకోవడానికి నానా తిప్పలు పడి, విభిన్న ప్రయత్నాలు చేసే వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ఓ దర్శకుడు చేస్తున్నాడు.
సాధారణంగా బుల్లితెరపై వచ్చే పలు డైలీ సీరియళ్లను ఏళ్లకి ఏళ్లు పొడిగిస్తూ, మనం చిన్ననాటి నుంచి యుక్త వయసు వచ్చే వరకు ఒకే సీరియల్ టెలికాస్ట్‌లు అవుతుండటం, వేలాది ఎపిసోడ్స్‌గా వాటిని సాగదీయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలా అత్యంత పెద్ద నిడివి కలిగిన సినిమాని తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన ఓ పుర్రెకు వచ్చింది. పాతకాలంలో తెలుగు చిత్రాలు ఎన్నో నాలుగైదు గంటల నిడివి ఉండేవి. కానీ ఈ స్పీడ్ యుగంలో ఇప్పుడు మూడు గంటల నిడివి అంటేనే ప్రేక్షకులు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. చివరకు బాలీవుడ్ చిత్రాలు కూడా ఇప్పుడు రెండున్నర, రెండు గంటల 15 నిమిషాలకు వచ్చేస్తున్నాయి.
కానీ తాజాగా స్వీడన్‌కి చెందిన ఓ దర్శకుడు అండర్స్ వెబర్గ్‌కి ఒక ఐడియా వచ్చింది. ఆయన ఏకంగా 720 గంటల నిడివి గల చిత్రాన్ని తీస్తున్నాడు. నెలరోజుల పాటు థియేటర్ల నుంచి కదలకుండా ఈచిత్రాన్ని వీక్షించవచ్చు. మూకీ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ పేరు 'ఆంబియన్స్'. దాదాపు 100 మంది నటీనటులు ఈ సినిమాలో నటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఒకే సారి రిలీజ్ చేసి ఒకే ఒక్క షో వేస్తారట. అంతేకాదు.. ఒకే ఒక్క షో వేసిన తర్వాత ఈ సినిమా కాపీలను తగలబెడతారట. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఆ దర్శకుడు మాత్రం వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెబుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ 72 నిమిషాల నిడివిలో 2018లో విడుదల కానుంది... సో లెటజ్ వెయిట్ ఫర్ ది ట్రైలర్ అండ్ మూవీ....!