అక్టోబర్ 6,7లు దగ్గర పడుతున్నాయి. ఈ రెండు రోజుల ప్రత్యేకత ఏమిటో స్పెషల్‌గా అక్కినేని ఫ్యాన్స్‌కి చెప్పాల్సిన పనిలేదు. ఈరెండు రోజుల్లోనే గోవాలో నాగచైతన్య-సమంతల వివాహం జరగనుంది. మరోవైపు నాగచైతన్య తన 'యుద్దంశరణం' విడుదలలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసుకుని, ప్రస్తుతం చందుమొండేటితో 'సవ్యసాచి', మారుతితో చిత్రం కోసం చైతూ రెడీ అవుతున్నాడు. మరోవైపు సమంత కూడా 'రాజుగారి గది 2'తో పాటు రామ్‌చరణ్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రంగస్థలం 1985', 'మహానటి', కొన్ని తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.
ఇటీవలే సమంత 'రాజు గారి గది 2'లోని నాగార్జున లుక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిస సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ చిత్రంలోని తన లుక్ ఉన్న ఫొటోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం షూటింగ్ పూర్తయిందని తెలిపింది. 2015లో ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన చిన్నచిత్రం 'రాజు గారి గది'కి సీక్వెల్‌గా కాకుండా కేవలం టైటిల్ మాత్రమే వాడుతున్న ఈ 'రాజుగారి గది2' రెడీ అవుతోంది. కాగా ఈచిత్రాన్ని పివిపి సంస్థ నిర్మిస్తోంది.
ఈ చిత్రంలోని నా పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఎంతో సరదాగా ఈ చిత్రం ఉంటుంది.. అందరినీ ఈ చిత్రం అలరిస్తుందని సమంత ట్వీట్ చేసింది. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున ఆల్‌రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చైతూ-సామ్‌ల పెళ్లికి ముందే 'యుద్దం శరణం' రిలీజ్ కానుండగా, వారి వివాహం జరిగిన వారం రోజులకే 'రాజుగారి గది 2' ప్రేక్షకుల ముందుకు రావడం విశేషంగా చెప్పాలి.