తెలుగులో 'శివ' తర్వాత అంతటి ట్రెండ్‌సెట్టింగ్ మూవీగా 'అర్జున్‌రెడ్డి'ని అందరూ గొప్పగా చెబుతున్నారు. ఈ చిత్రంతో తెలంగాణకి చెందిన ఏకైక సూపర్‌స్టార్‌గా విజయ్ దేవరకొండని చెబుతున్నారు. ఇక ఆయనను ఇప్పుడు తమ కులం ఉచ్చులోకి కొందరు లాగుతున్నారు. సినిమాలను ఏలుతున్న కమ్మ, కాపు తర్వాత వెలమ కులానికి చెందిన విజయ్ సూపర్‌స్టార్ అని ఆయనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో బంధుత్వం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిని విజయ్ అంగీకరించాడు. చిన్న కమ్యూనిటీ కావడం వల్ల ఎక్కడో తమకు కేసీఆర్‌కి బందుత్వం ఉందని, అయినా తాను ఇప్పటివరకు కేసీఆర్‌ని కలవలేదని, కానీ ఆయన కుమారుడు కేటీఆర్‌ని తాను కలవాలనుకుంటున్నానని చెప్పాడు. ఇటీవల కలిశాడు కూడా.
ఇక ఈ చిత్రానికి 'అర్జున్‌రెడ్డి' అనే టైటిల్‌ని పెట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఇప్పుడు కాస్త తన పేరుపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా మొదటి నుంచి సందీప్‌రెడ్డి వంగా అని పిలిపించుకుంటూ చెప్పించుకుంటున్న ఈయన తాజాగా తన పేరుకి చివర రెడ్డి అని రాయవద్దని కేవలం సందీప్ వంగా అనే రాయాలని మీడియాని కోరుతున్నాడు. అయినా సినిమా పరిశ్రమలో ఒకప్పటి నాగిరెడ్డి, హెచ్.ఎం.రెడ్డి, ఎమ్మెస్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డితో పాటు ప్రస్తుతం ఊపు మీదున్న సురేందర్‌రెడ్డి కూడా రెడ్డిగా పేరు వేసుకుంటుంటే సందీప్‌రెడ్డి వంగా మాత్రం తన పేరు చివరి రెడ్డి ఉంటే తన భవిష్యత్తుకి అవరోధమని భావిస్తున్నాడు. ఇక ఈచిత్రం మొదటి నుంచి వివాదాలతో ఉండటం సినిమాకి ప్లస్ అయిందనే చెప్పాలి. అయినా ఈ చిత్రం హీరో విజయ్, దర్శకుడు సందీప్‌లు మాత్రం ఈ చిత్ర విజయాన్ని మరింత భారీగా చేయాలని కంకణం కట్టుకున్నట్లు వున్నారు.
అందుకే ఈ చిత్రం ఇప్పటికే 3గంటల నిడివి ఉన్నప్పటికీ ఇప్పుడు మరో 15 నిమిషాల ఎడిట్‌చేసిన భాగాన్ని కలిపి మరింత మంది రిపీటెడ్ ఆడియన్స్‌ను సంపాదించాలని చూస్తున్నారు. ఇక ఈ చిత్రం పోస్టర్లపై, థియేటర్ల వద్ద మహిళా సంఘాలు మాత్రం పెద్దగా ఆందోళనలను చేస్తూ సినిమాని చూడవద్దని కోరుతున్నాయి. దీంతో దర్శకుడు సందీప్‌రెడ్డి సంయమనం పాటించకుండా సీరియస్ అయి, వస్తున్న విజ్ఞప్తలను సహృదయంతో తీసుకోకుండా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సినిమాని అడ్డుకుంటే తానేమీ చేయలేనని, మహిళా సంఘాలు అలా ఎందుకు చేస్తున్నాయో తనకు తెలియడం లేదన్నాడు. భవిష్యత్లులో కూడా ఇలాగే జరిగితే బాలీవుడ్‌కి వెళ్లి హిందీ, భోజ్‌పూరి, కన్నడ చిత్రాలు తీసుకుంటానని హెచ్చరిక ధోరణిలో స్పందించాడు.
అక్కడా వీలుకాకపోతే హాలీవుడ్‌కి వెళ్తానని, బ్లాక్‌మెయిలింగ్‌గా మాట్లాడుతున్నాడు. సందీప్‌రెడ్డిలో మంచి దర్శకుడే ఉండవచ్చు. కానీ ఆయన బెదిరింపు ధోరణి చూస్తే నవ్వోస్తోంది. గతంలో ఎవడో చెరువు మీద అలిగి.. ఏదో కడుక్కోలేదట. ఆయన ప్రవర్తన మాటలు అలానే ఉన్నాయి. గతంలో కమల్‌హాసన్, అమీర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్‌తో పాటు రాంగోపాల్‌వర్మ బ్రీడ్ ఎక్కువగా కనిపిస్తున్న సందీప్‌రెడ్డి వంటి వారెందరో దేశాలను విడిచిపోతామని, మరలా సినిమాలు చేయమని, ఇంకా ఓ అడుగు ముందుకేసి విదేశాలకు వెళ్తామని ప్రకటనలు ఇచ్చారు.
'గోవిందా గోవిందా' చిత్రం సెన్సార్ అభ్యంతరాలను ఎదుర్కొన్నప్పుడు ఇదే మాట చెప్పి వర్మ బాలీవుడ్‌కి వెళ్లాడు. కట్ చేస్తే పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. సినిమా అనేది ఆకాశం. ఇలాంటి సందీప్‌రెడ్డిలు కేవలం పాసింగ్ క్లౌడ్స్‌వంటి వారు. వస్తుంటారు.. పోతుంటారు. ఆయనకు అంత ఇదిగా ఉంటే 'బాహుబలి'లో చూపిన కిల్కి భాషలోనైనా సినిమాలు తీసుకోవచ్చు. ఆయన లేడని జనాలు సినిమాలు చూడటం మానరు. మిగిలిన దర్శకులు సినిమా తీయకుండా ఉండరు. ఇక ఈ సందీప్‌రెడ్డి త్వరలో శర్వానంద్‌తో సినిమా తీస్తున్నట్లు సమాచారం.