పెద్ద నోట్ల రద్దు ద్వారా ఏదో సాధిస్తామని భావించి, చివరకు కొండను తవ్వి, ఎలుకను పట్టిన చందంగా మోడీ తీరు ఉంది. దేశంలో నగదు లావాదేవీలు ఎక్కువగా ఉండటంతో దేశాన్ని నగదు రహిత దేశంగా తీర్చిదిద్దాలని మోదీ కలలు కంటున్నారు. అయినా పేదరికం, గ్రామీణ వ్యవస్థ, అక్షరాస్యత తక్కువ ఉన్న దేశంలో ఇది ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో వేచిచూడాల్సివుంది. ఇందులో భాగంగా డిజిటల్ పేమెంట్స్‌కి ప్రోత్సహకాలు కూడా అందించాలని మోదీ నిర్ణయించాడు.
అయినా మన దేశంలో ముందుగా సైబర్ నేరాలను అడ్డుకునే పటిష్టమైన వ్యవస్థ లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాస్త ఆందోళనకరమే. అయినా మోదీ తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నచందంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తాజాగా అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లకు, ఏజెన్సీలకు డిజిటల్ లావాదేవీలను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైల్వేలు, రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, విమానయాన రంగాలలో వీటిని తప్పని సరి చేయనున్నారు. భీమ్, భారత్ క్యూ ఆర్ కోడ్ వంటి అధికారిక పేమెంట్స్ మోడ్స్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్‌కు గేట్ వేని తెరవాలని ప్రభుత్వం సిద్దం అవుతోంది.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి బిగ్ టిక్కెట్ క్యాంపెయిన్‌ని లాంచ్ చేసి వచ్చే రిపబ్లిక్‌డే వరకు ఈ క్యాంపెయిన్‌ని నిర్వహించనున్నారు. డిజిటల్ పేమెంట్లను స్వీకరించడానికి టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. కొత్త నిబంధనల కింద దేశవ్యాప్తంగా ఉన్న 14 లక్షల రిజర్వేషన్ కౌంటర్ల వద్ద భారత్ క్యూఆర్ కోడ్‌ని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో కేవలం రైల్వే శాఖలోనే 52 వేల కోట్ల విలువైన టిక్కెట్లను విక్రయిస్తుండటంతో మొదటి ఈ శాఖపై ప్రభుత్వం దృష్టి సారించింది. రైల్వే, బస్సు, మెట్రో, పాస్‌పోర్ట్ వంటి అన్ని ప్రభుత్వ శాఖలకు దీనిని తప్పని సరి చేయనున్నారని తెలుస్తోంది.