కమెడియన్ టర్న్‌డ్ హీరో సునీల్‌కి తన కెరీర్ ప్రారంభంలో 'అందాల రాముడు, మర్యాదరామన్న, పూలరంగడు' తర్వాత మరో హిట్ లేదు. హిట్ కాదు కదా చివరకు యావరేజ్ హిట్ కూడా లేదు. ఆయనతో చిత్రాలు తీసి ఏకంగా సురేష్‌బాబు, దిల్‌రాజులు కూడా భంగపడ్డారు. ఇక ప్రస్తుతం సునీల్ ఫీల్‌గుడ్ మూవీస్ 'ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' దర్శకుడు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'ఉంగరాల రాంబాబు' చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ఎంతో కాలం అయినా బిజినెస్ కాక, పలు ఆర్ధిక ఇబ్బందుల వల్ల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా నిదానంగా జరుపుకుంటోంది.
మొదట్లో ఈ చిత్రాన్ని ఎలాగైనా దిల్‌రాజు ద్వారా మార్కెటింగ్ చేయించాలని, సినిమాని కొనడానికి ఎవ్వరు ముందుకు రాకపోవడంతో కనీసం దిల్‌రాజు చేతిలో పడితే అయినా చిత్రానికి మోక్షం వస్తుందని దర్శకనిర్మాతలు, హీరో భావించారు. కానీ అది వర్కౌట్ అయినట్లు లేదు. దాంతో ఈ చిత్రంలో సునీల్ ఇంట్రడక్షన్ సీన్స్‌కి దిల్‌రాజు చేత వాయిస్ ఓవర్ చెప్పించారని సమాచారం. అలా దిల్‌రాజు లక్ కొంతైనా తమకు వస్తుందని యూనిట్ ఆనందపడుతోంది.
నేడు హీరోలకి, మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం బాగానే ఉన్నా దిల్‌రాజు చేత వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఈచిత్రంలో మలయాళ నటి మియాజార్జ్ నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మరో ఫేడవుట్ సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
మరి దిల్‌రాజు తీసిన 'కృష్ణాష్టమి' టైప్‌లోనే ఈ చిత్రం ఫలితం ఉంటుందా? తానే నిర్మాతగా హిట్టు కొట్టలేకపోయిన దిల్‌రాజు కేవలం వాయిస్ ఓవర్‌తో ఈ చిత్రం లక్‌ని మారుస్తాడో లేదో వేచిచూడాల్సివుంది...! కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 15 వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.