బాలకృష్ణ 'పైసా వసూల్' మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి దిగిపోనుంది. 'పైసా వసూల్' కోసం బాలకృష్ణ జోరుగా, ఎనర్జిటిక్ గా ప్రమోషన్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాడు. అసలు బాలయ్య శుక్రవారం విడుదల కాబోయే 'పైసా వసూల్' చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడో లేదో తెలియదు కానీ ఆ సినిమాకి ఎంతటి పబ్లిసిటీ చెయ్యాలో అంతటి పబ్లిసిటీ చేస్తూ హుషారుగా ఉన్నాడు. అయితే 'పైసా వసూల్' ప్రమోషన్ లో భాగంగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలకృష్ణ ఇండియాలోని నటీనటులు రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడి సంచలనం అయ్యాడు.
రాజకీయాల్లో సినీ నటులు రాణించాలంటే అంత సులభం కాదని చెప్పిన బాలయ్య అలా రాజకీయాల్లో ఒక సినీ నటుడు రాణించడం ఒక్క ఎన్టీఆర్ వల్లే జరిగిందని చెప్పాడు. అసలు సినిమా నటులు రాజకీయాల్లోకి రావడంపై ఆవేశంగా మాట్లాడిన బాలకృష్ణ ఇద్దరు మెగా స్టార్స్ గురించి సంచలనంగా మాట్లాడాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ రాజకీయాల్లోకి రావడంపై బాలకృష్ణ కామెంట్ చేశాడు. బాలీవుడ్ లో అమితాబచ్చన్ ఉన్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు అంటూనే... పార్లమెంట్ కి వెళ్లి ఆటోగ్రాఫ్ లు ఇవ్వడం తప్ప అంటూ సంచలనంగా మాట్లాడాడు. అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరు గురించి మాట్లాడుతూ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశాడు అంటూ ఆవేశంగా మాట్లాడి... సినిమా నటులెవరు రాజకీయాల్లోకి రావొద్దంటూ హెచ్చరించాడు.
అయితే సదరు ఛానల్ యాంకర్ బాలకృష్ణ ని మరి మీరు హిందూపూర్ కి ఎమ్యెల్యేగా ఏం చేసారని అడగగానే... మా వంశం వేరు.... మా బ్లడ్ వేరు... దేనికైనా క్రెడిబిలిటీ ఉండాలి. సినిమా స్టార్ అనే టాగ్ ఒకటే సరిపోదు. అలాగే వేరే హీరోలు సినిమాల్లో చెబితే అది డైలాగ్.. కానీ నేను మాట్లాడేది మాత్రం సినిమాల్లోని డైలాగ్ కాదు. అసలు నేనేం మాట్లాడాలనుకున్నానో అది స్పష్టంగా మాట్లాడతా అంటూ దడ దడ లాడించేశాడు. అయితే అమితాబ్ మీద చిరు మీద బాలయ్య చేసిన కామెంట్స్ కి ఆ ఇద్దరు మెగాస్టార్స్ ఫాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.