నాటి 'అల్లూరి సీతారామరాజు'నుంచి నిన్నటి 'మగధీర, శ్రీమంతుడు' వరకు ఎన్నో చిత్రాల కథలు తమవంటూ సినిమాలు విడుదలై హిట్టయిన తర్వాత పలువురు ఫిల్మ్‌చాంబర్‌లలో ఫిర్యాదులు చేస్తుంటే.. మరికొందరు ఏకంగా కోర్టు మెట్లెక్కుతున్నారు. గతంలో పెద్ద వంశీ దర్శకత్వం వహించిన 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, ఏప్రిల్ 1 విడుదల' చిత్రాల కథలు కూడా తాము స్వాతి, విపుల, చతుర వంటి వాటికి రాసిన కథల ఆధారంగా తీసుకుని రూపొందించేనవేనని పలువురు రచయితలు ఆందోళన చేశారు. ఇక 'మగధీర'లోని ఓ పాట తనదని వంగవీటి, ఈ చిత్రం తన నవలేనని, అందులోని పాత్ర ధారుల పేర్లను కూడా అటు ఇటు చేసి కాపీ కొట్టారని ఓ రచయిత నిరసన వ్యక్తం చేశాడు.
'శ్రీమంతుడు' కథ తనదేనని ఓ రచయిత ఆందోళన చేయడంతో కొరటాల శివ దానిని మేనేజ్ చేశాడు. తాజాగా కూడా ఆయన మహేష్‌బాబుతో చేస్తున్న 'భరత్ అనే నేను' కూడా ఆయన కథ కాదని, వేరే వ్యక్తి నుంచి కథను తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్ మూవీ 'రాబ్తా' తమ 'మగధీర'నే అని అల్లుఅరవింద్ విడుదలకు కొంత వ్యవధి మాత్రమే ఉన్న సమయంలో కోర్టు మెట్లెక్కడం, చివరకు ఆ చిత్రానికి, 'మగధీర'కి సంబంధమే లేదని కోర్టు తీర్పు చెప్పింది.
ఇక తాజాగా రానా దగ్గుబాటి హీరోగా తేజ దర్శకత్వంలో సురేష్‌బాబు నిర్మించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం కథ తనదేనని తిమ్మారెడ్డి అనే రచయిత ఆరోపిస్తున్నాడు. ఇక ఇప్పటికే లిప్‌లాక్ కిస్సులు, బూతు కంటెంట్, వి.హన్మంతరావు కిస్ సీన్ల పోస్టర్లను చించేయడంతో 'అర్జున్‌రెడ్డి' టీం వివాదాలలో ఉంది. హీరో విజయ్, దర్శకుడు సందీప్‌రెడ్డి, రాంగోపాల్‌వర్మ నుంచి నాగార్జున వరకు ఈ విషయంలో వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్రీ ప్రమోషన్‌ని ఈ విధంగా పొందిందని చెప్పవచ్చు.
కాగా ఇప్పుడు ఖమ్మంకు చెందిన ఓ దర్శక రచయిత డి.నాగరాజు తాను తీసిన 'ఇక..సె లవ్' చిత్రాన్నే ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టారని, వీరు తనకు నష్టపరిహారంగా రెండు కోట్లు ఇవ్వాలని నోటీసులు జారీ చేయించాడు. అలా చేయకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటానంటున్నాడు. ఇక ఈయన తానే సినిమా తీసి దానినే ఉదాహరణగా చూపేంత దైర్యం చేస్తున్నాడంటే ఇది కేవలం ఫేక్ అని కొట్టిపారేయలేమని, ఆయన సినిమాను చూస్తే అసలు గుట్టు బయటపడుతుందని అంటున్నారు. మొత్తానికి మరో వివాదం 'అర్జున్‌రెడ్డి'కి ఈ రూపేన రావడం అదృష్టమా? దురదృష్టమా? అనేది వేచిచూడాల్సివుంది.