రాంగోపాల్ వర్మ సినిమాల ద్వారా సంచలనం సృష్టించే బదులు తన కామెంట్స్ ద్వారా ఎంతో కాలంగా వార్తల్లో ఉంటున్నాడు. ఆయన తీసిన 'సర్కార్ 3' కూడా పట్టుమని పదిరోజులు కూడా ఆడలేదు. అయినా ఆయన తనకు హిట్ ఎలా వస్తుందా? అని కష్టపడకుండా పరాన్నజీవిగా ఇతరులు తీసే చిత్రాల ద్వారా వార్తల్లో ఉంటున్నాడు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం, బాలకృష్ణ, పూరీ జగన్నాథ్‌లను పొగడ్తలతో ముంచెత్తడం, తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో ప్రభుత్వాలపై, అధికారులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం వంటివి చేస్తున్నాడు.
ఇక ఆయనకు ఇప్పుడు అనుకోని వరంగా 'అర్జున్‌రెడ్డి' చిక్కింది. ఇందులో విజయ్‌దేవరకొండ, హీరోయిన్ల మద్య వచ్చే లిప్‌లాక్‌ని పోస్టర్లలలో, పబ్లిసిటీలో వాడటం, వాటిని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు చింపేయడంతో హీరో విజయ్, దర్శకుడు, వర్మలు విహెచ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఈ చిత్రం విడుదలకు ముందు మొదలైన ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. విజయ్ దేవరకొండ తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కి బంధువు కావడం వల్లే కేటీఆర్ ఆ చిత్రాన్ని పొడుగుతున్నాడని విహెచ్ కామెంట్స్ చేయగా, మరోసారి విజయ్ చిల్ తాతయ్య అని మరో పోస్ట్ పెట్టాడు.
ఇక వర్మ ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. ఆయన 'అర్జున్‌రెడ్డి' యూనిట్‌ని ఉద్దేశించి చెబుతూ, ఇందులోని ముద్దు సీన్లన్నింటినీ కట్ చేసి ఓ పెన్ డ్రైవ్‌లో వేసి ముసలాయన విహెచ్‌కి ఇవ్వాలని, వాటిని ఆయన ఒంటిరిగా చూసుకుని ఆనంద పడతాడని వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ పవన్ కంటే 10రెట్లు బెటర్ అని వ్యాఖ్యానించిన వర్మ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి విజయ్ దేవరకొండను ఏకంగా హాలీవుడ్ హీరో లియనార్డో డికాప్రియోతో పోల్చాడు. విజయ్ డికాప్రియో స్థాయి నటుడని చెప్పడానికి నాకు ఎలాంటి సంశయం లేదు. ఫిల్మ్‌మేకింగ్‌లోని స్టాండర్డ్స్‌లో మార్పులు తెచ్చే దిశగా విజయ్ తన స్టార్ డమ్‌ని ఉపయోగించుకోవాలి. ఇతర హీరోలకు భిన్నమైన చిత్రాలను ఎంచుకోవడం ద్వారనే డికాప్రియో స్టార్ అయ్యాడు. అలాగే విజయ్ కూడా ఇలాంటి విభిన్న కథలతో టాలీవుడ్ పంధాని మార్చాలి అంటూ విజయ్‌ని ఆకాశానికి ఎత్తేశాడు.
సరే పక్కవారు తీస్తున్న చిత్రాలను పొగడటం కాదు.. తాను కూడా కొత్త పంధాలో ఎలా చిత్రాలు తీయాలి? ఒకే తరహా చిత్రాలను, మూస చిత్రాలను, ఎంత సేపు మాఫియా, సెక్స్, హర్రర్ చిత్రాలను పక్కనపెట్టి కొత్తతరం దర్శకులైన 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డిలా ఎలా ఆలోచించాలి? అనే విషయాలలో వర్మ సరైన పాఠం నేర్చుకుంటే మంచిది.