బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తన చెల్లెలికి సినిమాల్లోకి రావడం ఇష్టంలేదని అంటున్నాడు. చూడడానికి చాలా ముద్దుగా, బొద్దుగా వుండే అర్జున్ కపూర్ చెల్లెలు అన్షులని చూసిన వారంతా..ఈ అమ్మాయి గ్యారంటీగా సినిమాల్లోకి వస్తుందని అనుకుంటారు. కానీ తన చెల్లెలికి ఈ ఫీల్డ్ అస్సలు ఇష్టం లేదని అర్జున్ కపూర్ తేల్చేశాడు.
తన చిత్రం ‘ముబారకన్’ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ ని అందుకోవడంతో ఎంతో ఆనందంతో వున్న అర్జున్ కపూర్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సోదరి అన్షుల గురించి ఈ విధంగా తెలిపాడు.
‘నా సోదరి అన్షులకి సినిమాల్లోకి రావడం ఇష్టంలేదు. సినిమాలు మాత్రం బాగా చూస్తుంది. ముఖ్యంగా నా సినిమా విడుదల అయితే చాలు ఓ సాధారణ అమ్మాయి లాగే ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకుని స్నేహితులతో కలిసి చూస్తుంది. నా సినిమాలకు అన్షుల ఓ ప్రేక్షకురాలుగా రిజల్ట్ చెబుతుంది. నేను నటించిన సినిమాలు విడుదలయ్యాక మొదట తన అభిప్రాయమే అడుగుతా. అన్షుల చెప్పే రిజల్ట్ ని బట్టి ప్రేక్షకులు నా నుండి ఎలాంటి సినిమాలు కావాలనుకుంటున్నారో నాకు తెలుస్తుంది...' అంటూ తన సోదరి గురించి చెప్పుకొచ్చాడు అర్జున్.