'ఎవడే సుబ్రహ్మణ్యం' ద్వారా కాస్త గుర్తింపు పొంది, 'పెళ్లిచూపులు'తో సెన్సేషన్ సృష్టించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇక ఆయన తాజాగా నటించిన 'అర్జున్‌రెడ్డి' సంచనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో సహజత్వంతో కూడిన ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వాస్తవానికి ఇలాంటి చిత్రాలు, అందునా ఎవర్‌గ్రీన్‌గా కనిపించే ఇలాంటి క్యారెక్టరైజేషన్లు జీవితకాలంలో ఎప్పుడో ఒకే సారి మాత్రమే వస్తాయి. అంతేగానీ ప్రతి చిత్రం 'అర్జున్‌రెడ్డి' అయిపోదు.
ఇక ఇలాంటి చిత్రమే మరో సినిమా తీయమని చెప్పినా ఆ దర్శకుడు తీయలేడేమో అన్నది వాస్తవం. ఇక విజయ్ దేవరకొండలో ఉన్న మైనస్ ఏమిటంటే... ఆయన విభిన్న చిత్రాలకు ప్లస్ అవుతాడే గానీ రొటీన్ కమర్షియల్ చిత్రాలకు పెద్దగా సూట్‌కాడు. ఈ విషయాన్ని 'పెళ్లిచూపులు' తర్వాత వచ్చిన 'ద్వారక' చిత్రం నిరూపించింది. 'పెళ్లి చూపులు'కి వచ్చిన క్రేజ్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయిందనే చెప్పాలి.
ఇప్పుడు ఈ హీరోని కొందరు పవన్‌కళ్యాణ్‌తో పోలుస్తుంటే రామ్‌గోపాల్ వర్మ వంటివారు ఏకంగా పవన్ కన్నా పదిరెట్లు బెటర్ అంటున్నారు. ఇక కాంతారావు, నితిన్‌ల తర్వాత తెలంగాణ నుంచి మరో హీరో వచ్చాడని తెలంగాణ వాదులు ఆనందపడుతున్నారు. అయితే అప్పుడే అంటే రెండు చిత్రాలతోనే ఏకంగా ఆయనను పవన్‌తో పోల్చడం సరికాదు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కంటే ఆయన క్యారెక్టరైజేషనే పెద్ద విజయానికి నాంది వేసింది. ఇక నుంచి విజయ్ దేవరకొండ నుంచి ప్రేక్షకులు అదే తరహా పాత్రలను, కిక్‌ని ఆశిస్తారు. కానీ దానిని వెంట వెంటనే ఇవ్వడం సులువు కాదు.
ఇక విజయ్ దేవరకొండ, నాని తరహా ఫాలోయింగ్‌ని సాధించడం మీదనే దృష్టి పెడితే మంచిది కానీ ఏకంగా పవన్‌తో పోల్చడం సరికాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. దీంతో ఆయనతో చిత్రాలు చేస్తున్న నందినిరెడ్డి, పరుశురామ్, భరత్ వంటి దర్శకులు విజయ్‌ని ఎలా చూపిస్తారోననే విషయం ఆసక్తిని రేపుతోంది.