ఒక్క 'బాహుబలి' సినిమాతోనే తెలుగు సినిమా స్థాయి ప్రపంచాన్ని తాకింది. ఇప్పుడు టాలీవుడ్ నుండి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి.. అంటే ప్రపంచ దృష్టి ఆ సినిమా మీద పడిపోతుంది. ప్రపంచం మొత్తం టాలీవుడ్ ని చూడడంతో ఇక్కడి దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలు వరల్డ్ వైడ్ రిలీజ్ కి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇక టాలీవుడ్ మూవీస్ కి బాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఏర్పడింది. తాజాగా వచ్చే టాలీవుడ్ సినిమాలన్నీ ఇప్పుడు బాలీవుడ్ పై బాగా దృష్టి సారించాయి. అందులో భాగంగానే తెలుగు, తమిళంలో ఏకకాలంలో మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడమే కాదు... ఈ సినిమా హిందీ హక్కులకు కూడా భారీ ధరకి ఒక బాలీవుడ్ నిర్మాణ సంస్థ 16 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే 'స్పైడర్' చిత్రం తెలుగు, తమిళంలో సెప్టెంబర్ 27 న విడుదలవుతుంటే హిందీలో 'స్పైడర్' విడుదల డేట్ ఇవ్వలేదు. అయితే ఆ సినిమా అక్కడ డబ్ అవుతుందా? లేదా రీమేక్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. విడుదలకు సిద్ధమైన మహేష్ 'స్పైడర్' కి క్రేజ్ ఈ లెవల్లో ఉంటే... ఇప్పుడిప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న మహేష్ తాజా చిత్రం 'భరత్ అనే నేను' చిత్రానికి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. కొరటాల డైరెక్షన్ లో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ 'భరత్ అనే నేను' చిత్రం కోసం వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ కోసం నిర్మాతకు భారీ ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కొరటాల - మహేష్ కాంబోలో వచ్చిన 'శ్రీమంతుడు' భారీ హిట్ అవడం.. కొరటాల శివ సమాజానికి ఉపయోగపడే మూవీస్ ని తెరకెక్కించడం, మహేష్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మరి సినిమా షూటింగ్ తొలినాళ్లలోనే ఇలా ప్రపంచవ్యాప్తంగా థియేటర్ హక్కులను అవుట్ రేట్ కు ఇవ్వమంటూ భారీ ఆఫర్లు వస్తున్నాయి అంటే గ్రేట్ అంటున్నారు. ఇక మహేష్ కి 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న క్రేజ్ తో థియేటర్ హక్కులు దాదాపు 80 కోట్లు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన మూడు భాషలు తమిళ, మలయాళ, హిందీభాషల హక్కులతో పాటే... ఓవర్సీస్ హక్కులు మొత్తం కలుపుకుని 40 కోట్ల వరకూ మహేష్ 'భరత్ అనే నేను' కి బిజినెస్ ఉండొచ్చని... ట్రేడ్ వర్గాల అంచనా. మరి ఈ ఫిగర్స్ చూస్తుంటే ఈ సినిమాను అవుట్ రేట్ గా 115 కోట్లకి కొనేందుకు బడా నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయి. మొత్తానికి షూటింగ్ మొదలెట్టగానే.. భరత్ కోసం బాక్సులతో రావడం చూస్తుంటే నిజంగానే మహేష్ బిజినెస్ మాన్ అనిపించాడు. కానీ ఈ ఆఫర్స్ పై 'భరత్ అనే నేను' నిర్మాత దానయ్య మాత్రం ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాడనే టాక్ వినబడుతుంది.