విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా డైరెక్షన్ లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా సెన్సేషనల్ హిట్టయ్యింది. ఈ సినిమాకి ముందు లిప్ లాక్ కిస్సుల పోస్టర్స్ విషయంలో పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. అలా మొదలెట్టింది కూడా ఒక పెద్దాయన. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు 'అర్జున్ రెడ్డి' కిస్సింగ్ పోస్టర్స్ ని సిటీ బస్సు ల మీద నుండి చింపేయడంతో స్టార్ట్ అయిన ఈ రచ్చ సినిమా విడుదల ముందు వరకు హైలెట్ అయ్యింది. వీహెచ్ తర్వాత మహిళా సంఘాలు కూడా ఈ లిప్ లాక్ కిస్ పోస్టర్స్ పై రచ్చ చేశారు. ఈ దెబ్బకి 'అర్జున్ రెడ్డి' చిత్రానికి అన్ని మీడియాలలో ఫ్రీగా పబ్లిసిటీ దొరికేసింది. నెగెటివ్ పబ్లిసిటీ అయినా ప్రేక్షకులకు నేరుగా చేరడంలో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
ఇక వీహెచ్ రచ్చ చేసిన సంగతికి విజయ్ కూడా 'ఛిల్ తాతయ్య' అంటూ కామెంట్ చెయ్యడం కూడా అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. ఇక సినిమా విడుదలైన తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకి అర్జున్ రెడ్డి గురించి మీడియాలో వీహెచ్ రచ్చ చెయ్యడం చూస్తుంటే 'అర్జున్ రెడ్డి' సినిమాకి మళ్ళీ పబ్లిసిటీ చేసి కలెక్షన్స్ పెంచేలాగే కనబడుతున్నాడు. ఈ 'అర్జున్ రెడ్డి' సినిమా ఇచ్చిన సందేశం వల్ల యువత డ్రగ్స్ కి, మందుకు, సిగరెట్లకు బానిసలవుతారని... ఈ సినిమా వల్ల యువత చెడిపోతారంటూ మళ్ళీ రచ్చ స్టార్ట్ చేశాడు. మీడియాకి ఎక్కిమరి 'అర్జున్ రెడ్డి' సినిమా గురించి డ్రగ్స్ కేసులో సెలబ్రిటీస్ కి చుక్కలు చూపెట్టిన అకున్ సబర్వాల్ కి ఫిర్యాదు చేస్తానంటూ బయలుదేరాడు.
మరి వీహెచ్ మొదలెట్టిన ఈ రచ్చతో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని... ఇలాంటి నెగెటివ్ పబ్లిసిటీ తో సినిమాకి మంచి క్రేజ్ రావడమే కాదు బాక్సాఫీసు వద్ద సినిమా కలెక్షన్స్ విపరీతంగా పెరుగుతాయంటున్నారు. సో... ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల పంట పండిస్తున్న 'అర్జున్ రెడ్డి' చిత్రం మళ్ళీ వీహెచ్ దెబ్బకి మరింత లాభాలు నిర్మాతలు జేబులో వేసుకోవడానికి రెడీ అవ్వాల్సిందే మరి.