తాజాగా సినీ విశ్లేషకుడు, బిగ్‌బాస్ షో ద్వారా సెలబ్రిటీ అయిన మహేష్ కత్తి.. పవన్ కళ్యాణ్ డబ్బులు లేవంటూనే పబ్లిక్ ఫంక్షన్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆడిట్ చూపిస్తారా? అని ప్రశ్నించడంతో పాటు పవన్ నటన, సినిమాల ఎంపిక, రాజకీయాలపై పలు విషయాలలో ఘాటు విమర్శలు చేశాడు. దాంతో పవన్ అభిమానులు కత్తి మహేష్‌ని చంపుతాం....... చంపిన తర్వాత నీ కొడుకులు కూడా గుర్తు పట్టలేని విధంగా చేస్తాం.. అని ప్రముఖ చానెల్ లైవ్‌షో సాక్షిగా మహేష్ కత్తిని బెదిరించారు.
ఇక పవన్ విషయానికి వస్తే ఆయన అభిమానులు కూడా గతంలో ఆయన అన్నయ్య చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీ సమయంలో రాజశేఖర్‌పై దాడి చేసి, ఎవరైనా చిరుకి ఓటు వేయం అంటే వారిపై కక్ష్య సాధింపులు చేసి చిరంజీవి వస్తే రాష్ట్రంలో గూండాయిజం వస్తుందేమో? అయనను విమర్శిచండం తప్పేమో అనే స్థితికి వచ్చారు. ఒకవైపు యువతలో ప్రశ్నించే గుణం పెంచడానికే తాను రాజకీయాలలోకి వచ్చానని చెబుతున్న పవన్, తనను ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వారిని చంపుతామని బెదిరిస్తున్న ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేయకపోవడం, ప్రశ్నించడం కోసమే మా దేవుడు రాజకీయాలలోకి వచ్చాడని చెప్పుకుంటున్న ఆయన అభిమానులు ఇలా ప్రశ్నించినందుకే వ్యక్తులపై పరుష పదజాలం, చంపుతామని హెచ్చరికలు చేయడం సమంజసం కాదు.
అసలు వేడుక ఏదైనా సరే పవన్ అభిమానులు చేస్తున్న గోల, ఏదైనా చిత్ర వేడుకలో పవన్ లేకపోయినా ఆయన పేరునే పలుకుతూ, గెంతులు వేస్తున్న తీరుని ఇంతకాలం పవన్ ఎందుకు సహిస్తూ ఉన్నారని సందేహం వస్తుంది. నిజంగానే మహేష్ కత్తి చెప్పినట్లు ఆయన చిత్రాల ఎంపిక సరిగాలేదు. తలాతోకా లేని 'సర్దార్‌గబ్బర్‌సింగ్, కాటమరాయుడు' వంటి చిత్రాలను ఒప్పుకుంటున్నాడు. కథల ఎంపికలో పరిణతిలేదు. ఎప్పుడో డబ్బింగ్ అయిన అజిత్ 'వీరం'ని రీమేక్ చేయడం చూస్తే తెలుగులో రచయితలు లేరా? తెలుగు పరిశ్రమ గొడ్డుపోయిందా? అనిపిస్తోంది.
ఇక ప్రత్యేకహోదా ఉద్యమం నుంచి ఆయన పలు విషయాలలో సమస్యలను లేవనెత్తుతున్నాడే గానీ ప్రజల మద్యకు రావడం లేదు. నంద్యాల, కాకినాడలో తన మద్దతు ఎవ్వరికీ లేదని చెప్పుకొచ్చాడు. ఇక డబ్బులు లేవంటు, కనీసం ఆఫీసురూమ్‌కి, బాయ్‌కి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని చెబుతున్న ఆయన నోవాటెల్‌తో పాటు పలు ప్రాంతాలలో ఎలా సభలు పెట్టగలుగుతున్నాడు? ఇవి మహేష్‌కత్తిలోనే కాదు.. పలువురిలో ప్రశ్నలు మొలకెత్తుతూ ఉన్నాయి. రాజకీయాలలో వచ్చిన తర్వాత పూల వర్షాలు కురుస్తాయి.. రాళ్లు కూడా పడుతాయని పవన్ తెలుసుకోవాలి.