బాలీవుడ్ లో ఒక భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతుంది అంటే ఆ బడ్జెట్ లో ఎక్కువ శాతం హీరో రెమ్యునరేషన్ కిందే వెళుతుంది. ఆ తర్వాత డైరెక్టర్, హీరోయిన్ కి భారీగా పారితోషికాలు ఉంటాయి. అయితే ఎప్పుడూ హీరోలే ఎక్కువ పారితోషకం తీసుకోవాలా అనే విషయంలో బాలీవుడ్ అంతటా చాలా రోజుల నుండి చర్చనీయాంశంగా ఉన్న అంశం. అయితే హీరోలు, హీరోయిన్ ల రెమ్యునరేషన్ విషయంలో కొందరు సుముఖంగా ఉంటే మరికొందరు హీరోయిన్స్ పట్ల ఈ పక్షపాత ధోరణి మారాలంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఒక హీరోయిన్ హీరోలకంటే ఎక్కువ పారితోషికం తీసుకుందనే న్యూస్ బాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
బాలీవుడ్ లో దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాలు ఎక్కువ పారితోషికం తీసుకుంటూ హీరోలకు గట్టి పోటీనిచ్చే రేంజ్ కి ఎప్పుడో ఎదిగారు. ప్రియాంక హాలీవుడ్ కి వెళ్లి ఇక్కడ బాలీవుడ్ నిర్మాతలకు చుక్కలు చూపించే రేంజ్లో పారితోషికం పెంచేసింది. అలాగే 'బాజీరావు మస్తాని'తో హిట్ అందుకున్న దీపికా పదుకొనె ఇప్పుడు మరోసారి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ‘పద్మావతి’ చిత్రంలో టైటిల్ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమా మొత్తం దీపికా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అలాగే ఈ చిత్రంలో షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ హీరోలుగా నటిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో దీపికానే కీలకం. షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ లు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నప్పటికీ దీపికా పాత్ర మాత్రం 'పద్మావతి'లో హైలెట్ కావడం వలన ఇప్పుడు దీపికా, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ ల కన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటుంది. ఈ సినిమాకి దీపిక ఏకంగా 13 కోట్లు తీసుకుంటే... షాహిద్, రణ్‌వీర్ మాత్రం కేవలం 10 కోట్ల పారితోషికమే తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో దీపికా కీలకం కావడం వల్ల ఆమెకి ఎక్కువ ఇచ్చారనే విషయంలో రణ్‌వీర్, షాహిద్ కూడా ఏమీ మాట్లాడలేకపోయారని చెబుతున్నారు.