విజయ్ దేవరకొండ అంటే నాని సినిమా 'ఎవడే సుబ్రమణ్యం' లో హీరోకి ఫ్రెండ్ కేరెక్టర్ చేసిన అబ్బాయి. అప్పుడు ఈ కుర్రాడేదో బావున్నాడే అన్నారు గాని.. అప్పట్లో అతన్ని గుర్తుపెట్టుకునే సీన్ ఎవ్వరికి లేదు. అలాగే పెళ్లిచూపులు సినిమాని సైలెంట్ గా షూటింగ్ జరిపి, ఆ సినిమా విడుదలకు కొద్దిగా ఫైనాన్స్ పరంగా కష్టపడినా... ఆ సినిమా బంపర్ హిట్టై బోలెడన్ని అవార్డులు కొట్టిన తర్వాత, అప్పుడు విజయ్ దేవరకొండ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. ఆ సినిమాతో విజయ్ స్టార్ అవతారమెత్తేశాడు. ఆ తర్వాత నటించిన 'ద్వారక' ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదు.
ఈలోపు విజయ్ ఫిలింఫేర్ కి హోస్ట్ గా చెయ్యడం వంటి పనులతోపాటు 'అర్జున్ రెడ్డి' అనే చిత్రాన్ని ఒక కొత్త దర్శకుడితో చేశాడు. అయితే ఈ సినిమా పూర్తయ్యి చాలాకాలం అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాకుండా ఉండిపోవడంతో విజయ్ ఈ సినిమాని థియేటర్స్ లోకి తెచ్చేందుకు బాగా కష్టపడ్డాడు. అయితే ఆ సినిమాకి పబ్లిసిటీ ఎలా చేస్తే నేరుగా జనాల్ని రీచ్ అవ్వొచ్చో అలాంటి పబ్లిసిటీతో విజయ్ రెచ్చిపోయాడు. సినిమా టీజర్ గురించి, ట్రైలర్ గురించి వెటకారంగా మాట్లాడిన జనాలు.... 'అర్జున్ రెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడిన మాటలను కూడా నెగెటివ్ యాంగిల్ లోనే ఆలోచించి కుర్రాడికి కొంచెం కొవ్వు ఎక్కువే అన్నారు. ఈ సినిమా ప్లాప్ అవ్వాలి అప్పుడు ఉంటుంది మనోడి సంగతి అంటూ కామెంట్స్ కూడా చేశారు.
అయితే ఇక్కడ అనూహ్యంగా ఏ సర్టిఫికెట్ తో వచ్చిన ఈ 'అర్జున్ రెడ్డి' చిత్రం యూత్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవడంతో సినిమా సూపర్ హిట్టయ్యింది. నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. అలాగే అప్పుడు మాట్లాడిన విజయ్ మాటలు ఇప్పుడు అందరికి నచ్చేశాయి. మరి కాంట్రవర్సియల్ గా మాట్లాడినా ఇప్పుడు ఆ సినిమా హిట్ తో అవి కాస్త గాల్లో కలిసిపోయాయి. అలాగే విజయ్ మాట్లాడిన మాటలు సినిమా కి మంచి పబ్లిసిటీ ఇచ్చాయంటున్నారు ఇప్పుడు. విజయ్ దేవరకొండ ఇప్పుడు స్లో పాయిజన్ గా ఎక్కేస్తున్నాడు. అందుకే ఇప్పుడు విజయ్ ని మెగాస్టార్ అని, పవర్ స్టార్ అంటూ ఎవరికిష్టమైన బిరుదులు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అయితే ఏకంగా విజయ్ దేవరకొండని '10 మంది పవర్‌స్టార్స్‌తో సమానం' అంటూ ఆకాశానికెత్తేయ్యడం చర్చనీయాంశం అయ్యింది.