నాడు ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీరంగారావు, సావిత్రి, జమున నటించిన బ్లాక్‌బస్టర్ 'గుండమ్మ కథ'. ఈ చిత్రంలో టైటిల్ రోల్ గుండమ్మపాత్రను సూర్యకాంతం చేసింది. ఇక ఆ తర్వాత ఈ చిత్రం రీమేక్ చేయాలని పలువురు భావించారు. మొదట్లో హీరోలుగా అలనాటి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, ఏయన్నార్ పాత్రని ఆయన కుమారుడు నాగార్జున చేత నటింపజేయాలని భావించారు. కానీ వాణిశ్రీతో పాటు పలువురిని గుండమ్మగా అనుకున్నా ఎవ్వరూ సూర్యకాంతం చాయలకు కూడా రాలేరని భావించి పక్కనపెట్టారు.
ఆ తర్వాత బాలకృష్ణ, నాగార్జునల మధ్య కాస్త విబేధాలు వచ్చి అసలు ప్రాజెక్టే అటకెక్కింది. ఇక నేటితరంలో నాటి ఎన్టీఆర్‌లా ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేయగలడని, ఎన్టీఆర్ ఇప్పుడున్న వారిలో ఓ సంపూర్ణ నటుడని, జూనియర్ ఎన్టీఆర్ ఓకే అంటే ఆయన్ను పెట్టి 'గుండమ్మకథ' చిత్రం చేయాలని ఉందని లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి అంటోంది. అలా చూసుకుంటే ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్‌ని తీసుకుంటే, ఏయన్నార్ పాత్రకి నాగచైతన్యని తీసుకోవాల్సి వస్తుంది. ఇక తమ బాబాయ్, తండ్రిల మద్య వైరుద్ద్యాలు ఉన్నకారణంగా జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యలు ఒప్పుకుంటారా?
అయినా ఇప్పటికీ గుండమ్మగా నటించే మనిషి ఎవరనేది సమస్యే. ఇక 'అలా మొదలైంది'తో దర్శకురాలిగా పరిచయమై హిట్ కొట్టి, తర్వాత సిద్దార్ద్, సమంతలతో 'జబర్దస్త్' చేసి ఈమె ఫ్లాప్‌ని మూటగట్టుకుంది. ఆ తర్వాత 'కళ్యాణవైభోగమే' చిత్రంతో ఓకే అనిపించింది. తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మిస్తుండగా, హీరో విజయ్‌దేవరకొండతో చేయనుంది. అయినా దర్శకురాలిగా ఎలాంటి పెద్ద గ్రాఫ్ లేని నందిని రెడ్డిని నమ్మి జూనియర్, చైతూలు ఒప్పుకుంటారా? మరి ఒప్పుకున్నా సూర్యకాంతానికి సరైన నటిని ఎలా వెదికి పట్టుకుంటుంది? అనేవన్నీ సంశయాలేనని చెప్పాలి.