తెలుగు సినీ రంగంలో ఒక శాఖలో రాణించాలని వచ్చిన వారు వేరు రంగాలలో అనూహ్య పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. రవితేజ, నాని, రాజ్‌తరుణ్‌లు దర్శకులు కావాలని వచ్చి ఆర్టిస్ట్‌లుగా మారారు. ఇక తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్, ఎల్బీశ్రీరాం, ఎమ్మెస్ నారాయణ, కొండవలస...ఇలా ఎందరో రచయితలుగా వచ్చి ఆర్టిస్ట్‌లు అయ్యారు. ఆర్‌పి పట్నాయక్ సంగీత దర్శకునిగా ప్రవేశించి నటుడిగా, దర్శకునిగా... ది గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ సైతం నటుడిగా మారాలని వచ్చి దర్శకులైనారు. ఇక అదే కోవకి చెందిన వాడు మెంటల్ కృష్ణ అలియాస్ పోసాని కృష్ణమురళి.
ఈయన ఫీల్డ్‌కి రచయితగా ప్రవేశించి, తర్వాత కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అంతకుముందే కొన్ని చిత్రాలలో నటించినా, వినాయక్ -రామ్‌చరణ్‌ల 'నాయక్'తో నటునిగా, క్యామెడీ సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారాడు. ఇక పూరీ జగన్నాథ్-ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'టెంపర్' చిత్రంలో నిజాయితీ కలిగిన పోలీసు కానిస్టేబుల్ పాత్ర ఆయనకు మరలా పెద్ద బ్రేక్ నిచ్చింది. కాగా తనకు రైటర్, డైరెక్టర్ కన్నా ఆర్టిస్టుగానే హాయిగా ఉందని, తనకు ఆర్ధికంగా, మనశ్శాంతి పరంగా బాగుందని చెప్పాడు.
ఇక తాను క్యారెక్టర్స్ ఎవ్వరినీ అడుక్కోనని, తన మేనల్లుడు అయిన కొరటాల శివను సైతం తాను వేషాలు అడగనని, తన వద్దకు వచ్చే పాత్రలే చేస్తానని అంటాడు. ఇక రచయితగా పోసాని కృష్ణమురళి చచ్చిపోయాడా? అన్న ప్రశ్నకు ఇండస్ట్రీలో పనికిరాకపోతే డస్ట్ బిన్‌లో పడేస్తారు. కానీ నేను 32 ఏళ్ల నుంచి పరిశ్రమలోనే ఉన్నాను. బిజీగా ఉంటున్నాను.
నన్ను డస్ట్ బిన్‌లో పడేయాలంటే నా కంటే టాలెంట్, నా కంటే స్పార్క్, నాకంటే దమ్మునోళ్లు వస్తే డస్ట్‌బిన్‌లో నన్ను కూడా పడేస్తారమోనని భయపడాలి. ఆ భయం నాకు లేదు. అయినా అతి తక్కువ సమయంలో నేను 100 చిత్రాలకు రచన చేశాను అని చెప్పుకొచ్చాడు.