సినిమాలలో కేవలం 500, 1000 రూపాయల కోసం స్టార్స్ స్థానంలో యాక్షన్ సీన్స్, భారీ ఛేజింగ్‌లు, ప్రాణాంతకమైన స్టంట్స్ చేసేది స్టంట్ ఆర్టిస్టులు. దేశానికి సైనికులు రక్ష అయితే సినిమా స్టార్స్‌కి స్టంట్‌మేన్‌లు రక్ష. ఇక ఇటీవలి కాలంలోనే తీసుకుంటే రవితేజ- అనుష్క- సురేష్‌బాబుల కాంబినేషన్‌లో వచ్చిన 'బలాదూర్' చిత్రంలోని ఓ సీన్ కోసం రవితేజ డూప్ నదిలో దూకి దారుణమరణానికి గురయ్యాడు. ఇక ఇటీవల ఓ కన్నడ చిత్రం కోసం ఓ జలపాతంలో హెలికాప్టర్‌లోంచి దూకి ఇద్దరు స్టంట్‌మేన్‌లు మరణించారు. మరి ఇలా ప్రాణాలను రిస్క్‌గా పెట్టుకుని ఐదొందలో లేక వెయ్యి రూపాయల కోసమో ప్రాణాలు తెగించి, అద్భుతమైన ఫీట్లు వీరు చేసినా చివరకు ఆ క్రెడిట్, గొప్పతనం అంతా ఆ స్టార్స్‌కే దక్కుతుంది.
ఇలా 'బలాదూర్'లో, కన్నడ చిత్రం సందర్బంగా చనిపోయిన వారికి నిర్మాతలు తూతూ మంత్రంగా ఏదో ఇచ్చారే గానీ మగదిక్కు , సంపాదన లేని వారి కుటుంబాలకు సరైన ఆర్థిక సాయం అందించలేదు. తాజాగా దక్షిణాది భారత సినీ అండ్ టీవీ స్టంట్ ఆర్టిస్టుల యూనియన్ స్థాపించి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా చెన్నెలో ఓ భారీ వేడుక చేశారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్,మోహన్‌లాల్, బాలకృష్ణ వంటి అతిరధ మహారధులు హాజరయ్యారు. తనకు 68 ఏళ్లు వచ్చినా యాక్షన్ సీన్స్ చేస్తున్నానంటే అది స్టంట్ ఆర్టిస్టుల గొప్పేనని సభాముఖంగా రజనీకాంత్ వినమ్రంగా ప్రకటించాడు. స్టంట్ ఆర్టిస్టులు ఎప్పుడు ఏ సహాయం కోసం వచ్చినా 24 గంటలు తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు.
'రోబో', '2.0'లను చూస్తే విదేశీ స్టంట్‌మేన్‌లకు ఇచ్చినట్లు రెమ్యూనరేషన్ మనవారికి కూడా ఇస్తే మనవారు కూడా ఆ స్థాయిలో చేయగలరన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించేవి యాక్షన్ చిత్రాలే అని, వాటిల్లో స్టంట్ ఆరిస్ట్‌ల గొప్పతనమే ఎక్కువని చెప్పాడు రజనీకాంత్. ఇక బాలకృష్ణ మాట్లాడుతూ, 25 ఏళ్ల కిందట మా నాన్నగారు ఈ అసోసియన్ వేడుకలకు వచ్చారు. 50ఏళ్ల వేడుకలకి నేను, 75ఏళ్ల వేడుకలకు నా కుమారుడు, 100ఏళ్ల వేడుకకు నా మనవడు వస్తారని చెప్పాడు. ఈ వేడుకలలో బాలకృష్ణ స్టేజీ మీద చేసిన స్టంట్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి.