ఆగష్టు 18 న చిన్న చిత్రంగా విడుదలైన 'ఆనందో బ్రహ్మ' సూపర్ హిట్ కలెక్షన్స్ కొల్లగొట్టకపోయినా నిర్మాతలు పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకురావడమే కాక ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తుంది. సినిమా విడుదలైనప్పుడు సెకండాఫ్ మినహా సినిమాలో ఏం లేదనే టాక్ వచ్చినా.. ఈ సినిమా క్రమేణా పాజిటివ్ టాక్ తోనే నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. తాప్సి లీడ్ రోల్ అన్నారు గాని.... ఈ 'ఆనందో బ్రహ్మ'లో కమెడియన్స్ అందరూ సినిమాని ఆదుకున్నారనే చెప్పాలి. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ వంటి కమెడియన్స్ ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు ఇది రెండో సినిమా కావడం విశేషం. వీరు నిర్మించిన మొదటి సినిమా 'భలే మంచి రోజు' పర్వాలేదనిపించినా.. కలెక్షన్స్ కొల్లగొట్టడంలో చతికిల పడింది. కానీ ఇప్పుడు ఈ 'ఆనందో బ్రహ్మ'కి పెట్టుబడి తో పాటు, దానికి డబుల్ కలెక్షన్స్ ని ఈ సినిమా కొల్లగొట్టింది. ఈ సినిమాని అన్ని ఏరియాలు అమ్మకుండా కొన్ని ఏరియాలు మాత్రమే అమ్మి మిగతా మూడొంతుల ఏరియాలను నిర్మాతలే స్వయంగా విడుదల చేసుకున్నారు. ఇక ఈ చిత్రానికి మూడు కోట్ల పెట్టుబడి పెడితే... ఆ మొత్తం ఆనందో.... నిర్మాతలకు జీ తెలుగు ఛానల్ శాటిలైట్ రైట్స్ కే ఇచ్చేసిందనే టాక్ వుంది.
ఇక ఈ సినిమాని అమ్మిన వారినుండి రెండు కోట్లు వచ్చాయని.... అలాగే నిర్మాతలవద్ద ఉంచుకున్న ఏరియాల నుండి మరో మూడు కోట్లు ఈ సినిమా కొల్లగొడుతుందని... మొత్తం కలిపి ఓ ఐదారు కోట్ల లాభాన్ని నిర్మాతలు జేబులో వేసుకునే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. మరి నిర్మాతలు ఆనందంగా ఉండడమే కాదు ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన మహి కూడా ఫుల్ హ్యాపీ గా ఉన్నాడంటున్నారు. మహి కి కూడా బోలెడు అవకాశాలు వస్తున్నాయట... అందుకే అంత ఆనందంగా వున్నాడట. మొత్తానికి 'ఆనందో బ్రహ్మ' అందరికి ఆనందాన్నే ఇచ్చిందన్నమాట.